క్రైమ్ మిర్రర్ : రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే అపురూప దృశ్యం తిమ్మాపూర్ మండలం రేణికుంటలో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టేందుకు అక్క ఏకంగా బస్సును మార్గమధ్యంలో ఆపించింది. బస్సులోనే సోదరుడికి రాఖీ కట్టి, మిఠాయి తినిపించి తన ప్రేమను చాటుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖని డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మెండ రాజుకు రాఖీ పండుగ రోజు సెలవు లభించలేదు. దీంతో ఆయన యథావిధిగా విధులకు హాజరయ్యారు. అయితే తమ్ముడికి రాఖీ కట్టకుండా పండుగ జరుపుకోవడం ఇష్టం లేని ఆయన సోదరి తమ్మనవేణి స్వప్న, గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సు రేణికుంటకు చేరుకోగానే దానిని ఆపించారు.
బస్సులో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న తమ్ముడు రాజు వద్దకు వెళ్లి ఆప్యాయంగా రాఖీ కట్టారు. అనంతరం ఇద్దరూ పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఊహించని విధంగా జరిగిన ఈ సోదరసోదరీమణుల ఆత్మీయ కలయికను చూసిన ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ రోజున విధి నిర్వహణలో ఉన్న తమ్ముడిని కలుసుకుని రాఖీ కట్టిన అక్క స్వప్నను, సోదరుడు రాజును ప్రయాణికులు అభినందించారు. ఈ ఘటన రేణికుంటలో కొద్దిసేపు ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పింది.
also read : సీక్రెట్‌గా సాగిన ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. ఒక్కటైన బుల్లితెర నటి శిరీష, మహి
