సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో ముగ్గురు యువకులను కటకటాల వెనక్కి పంపించింది. వన్యప్రాణిని వేటాడి, దాన్ని వండుకుని తింటున్న దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు కలిసి ఉడుమును వేటాడినట్లు గుర్తించారు. అనంతరం దాన్ని వండుకుని తింటున్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో అధికారుల దృష్టికి రావడంతో దర్యాప్తు చేపట్టారు.
వీడియో ఆధారంగా నిందితులను గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఉడుమును ఈ చట్టంలోని షెడ్యూల్-1లో చేర్చినందున దాని వేట, హత్యకు సంబంధించి కఠిన నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
వేటకు ఉపయోగించినట్లు భావిస్తున్న మూడు బండ తుపాకులు, రెండు విల్లంబులను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు నిందితులను దంతేవాడ కోర్టులో హాజరుపరిచారు.
also read: రెసిడెన్సీ ముసుగులో వ్యభిచార దందా.. రెండు జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
