పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల కుమార్తెను స్కూటీపై ఒంటరిగా వదిలి ఓ దంపతులు గోదావరి నదిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. చించినాడ వశిష్ట గోదావరి వంతెన సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు తమ మూడేళ్ల కుమార్తెను స్కూటీపై వంతెన సమీపంలో ఉంచి గోదావరిలోకి దూకినట్లు తెలుస్తోంది. చీకటి సమయంలో వంతెన వద్ద చిన్నారి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమె ఏడుపు విని అక్కడికి చేరుకున్నారు.
తల్లిదండ్రులు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం గోదావరిలో గల్లంతైన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దంపతులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. దంపతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
also read: హైదరాబాద్లో విషాదం.. భర్త రెండో పెళ్లితో భార్య ఆత్మహత్య
