క్రైమ్ మిర్రర్ : భారీ వర్షాలు, వరదలతో నేపాల్‌లో తీవ్ర విషాద పరిస్థితులు నెలకొన్నాయి. వరదల్లో మృతి చెందిన వారి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. భారత్‌తో సరిహద్దు కలిగిన నేపాల్‌లోని చిత్వాన్ జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా 132 మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. నేపాల్ నుంచి ప్రవహించే గండక్ నదిలో మూడు మృతదేహాలు భారత్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహరాజ్‌గంజ్ ప్రాంతంలో బయటపడ్డాయి. సశస్త్ర సీమా బల్ (SSB) సిబ్బంది వీటిని గుర్తించి మోటార్ బోట్ల సహాయంతో నదిలో నుంచి వెలికితీశారు. మృతదేహాల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడి మృతదేహం ఉన్నట్లు ఎస్‌ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. అయితే మృతుల గుర్తింపు వివరాలు ఇంకా తెలియరాలేదు.
నేపాల్ నుంచి 200 కిలోమీటర్లు కొట్టుకొచ్చాయా?
భారత్‌లో లభ్యమైన మృతదేహాలు నేపాల్ వరదల్లో గల్లంతైన వారివే అయితే.. అవి దాదాపు 200 కిలోమీటర్ల దూరం నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం సంబంధిత అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, హిమపాతం కారణంగా నారాయణి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భోటెకోశి, త్రిశూలి నదులు కలిసిన తర్వాత నారాయణి నదిగా మారుతుంది. దీనినే కాళీ గండకీ అని కూడా పిలుస్తారు. అనంతరం ఈ నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత గండక్‌గా ప్రసిద్ధి చెందింది. గండక్ నది ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి పట్నా సమీపంలోని హాజీపూర్-సోనేపూర్ ప్రాంతంలో గంగా నదిలో కలుస్తుంది.
యూపీ, బిహార్‌లో అప్రమత్తత
నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. గండక్ నది పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఉన్న లోతట్టు గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం, పరిసర ప్రాంతాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద పరిస్థితిపై సంబంధిత శాఖల అధికారులు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు.
also read : సోనియా గాంధీ పుస్తకంపై పెంగ్విన్ కీలక ప్రకటన.. ప్రచురణ విషయంలో అసలు విషయం ఇదే!
