క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా పరిధిలో సుమారు రెండు నెలల క్రితం జరిగిన మహిళ దారుణ హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. భారీగా వడ్డీ ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాల్సి రావడంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే ఆదిలక్ష్మి (32)కి నిందితురాలు అధిక వడ్డీ ఆశ చూపినట్లు తెలుస్తోంది. ఆమె మాటలను నమ్మిన ఆదిలక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను విక్రయించడంతో పాటు ఇతరుల వద్ద అప్పులు చేసి సుమారు రూ.50 లక్షలు సమకూర్చి నిందితురాలికి ఇచ్చింది. అయితే ఒప్పందం ప్రకారం గడువు ముగిసినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఆదిలక్ష్మి తన నగదును తిరిగి ఇవ్వాలని నిందితురాలిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో డబ్బులు చెల్లించకుండా తప్పించుకునేందుకు ఆమెను హత్య చేయాలని నిందితురాలు నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు.
డబ్బులు ఇస్తానని పిలిచి..
నగదు తిరిగి ఇస్తానని నమ్మించి ఆదిలక్ష్మిని ఇంటికి రప్పించిన నిందితురాలు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం హత్య విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి సమీపంలోని వ్యవసాయ పొలంలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదింపు
భార్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు వ్యవసాయ పొలానికి చేరుకుని అక్కడ పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read :సీఐ తీరుపై వివాదం.. ఆందోళన చేస్తున్న బాధితుడిపై దాడి
