-
ఆర్.డీ.ఓ. ఆదేశాలనూ పట్టించుకోని శేరిలింగంపల్లి తహసీల్దార్..?
-
ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తున్నారా..?
-
ఆ సర్వే నంబర్‌పై ఎందుకంత మౌనం..?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: రెవెన్యూ శాఖలో కీలకమైన భూ రికార్డుల విషయంలో అధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నంబర్ 27/1కు సంబంధించిన భూ వ్యవహారంలో సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని పూర్తిగా, పాయింట్ వారీగా అందించడంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారు సమాచారం కోరగా, పూర్తిస్థాయి సమాచారం అందకపోవడంతో ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లారు. అనంతరం ఆర్.డీ.ఓ. మరియు అప్పీల్ అథారిటీ సమక్షంలో విచారణ జరిగింది.
విచారణ అనంతరం 05-08-2026 తేదీన జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో, సంబంధిత పీఐఓ/నాయబ్ తహసీల్దార్ కార్యాలయం రికార్డులను మరోసారి పరిశీలించి, 15 రోజుల్లో పాయింట్ వారీగా సమాచారం అందించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఆ గడువు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు పూర్తి పాయింట్ వారీ సమాచారం అందలేదని దరఖాస్తుదారు చెబుతున్నారు.
-
1955 నుంచి 2016 వరకు మాత్రమే పహాణీలు ఎందుకు?
ఈ వ్యవహారంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి 1955 నుంచి 2016 వరకు ఉన్న పహాణి రికార్డులు మాత్రమే అందించినట్లు సమాచారం. అయితే దరఖాస్తులో కోరిన మిగిలిన సమాచారంపై స్పష్టమైన పాయింట్ వారీ సమాధానం ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసలు రికార్డులు ఏమంటున్నాయి..? ఇంకా అందుబాటులో ఉన్న భూ రికార్డులు ఏంటి..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
-
‘కనెక్టెడ్ ఫైల్ నంబర్’ ఎవరి బాధ్యత?
మరో ఆసక్తికర అంశం కనెక్టెడ్ ఫైల్ నంబర్. సంబంధిత కార్యాలయ ఎండార్స్‌మెంట్‌లో కనెక్టెడ్ ఫైల్ నంబర్ లేకపోవడంతో సమాచారం అందించలేమని, దానిని దరఖాస్తుదారుడు అందించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఒక ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే అంతర్గత ఫైల్ నంబర్‌ను గుర్తించి అందించాల్సిన బాధ్యత ఎవరిది..? రికార్డులను నిర్వహిస్తున్న అధికారులదా..? లేక సమాచారాన్ని కోరుతున్న సాధారణ పౌరుడిదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
-
ఆ సర్వే నంబర్‌పై ఎందుకింత మౌనం..?
సర్వే నంబర్ 27/1కు సంబంధించిన పూర్తి భూ చరిత్ర, పహాణి రికార్డులు, రెవెన్యూ రికార్డులు, సంబంధిత ఫైళ్లు, ఇతర అనుబంధ రికార్డులపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం అయితే దాని స్థితిగతులపై అధికారిక రికార్డుల ఆధారంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, ఆ భూమిలో ప్రైవేట్ కమర్షియల్ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు లేదా ఇతర చర్యలు జరిగి ఉంటే, వాటి వెనుక ఉన్న అధికారిక రికార్డులు ఏమిటన్నది కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.
-
ప్రభుత్వ భూమి అని నిర్ధారణ జరిగితే.. తర్వాత ఏం జరిగింది?
ఈ వ్యవహారంలో భూమి ప్రభుత్వ భూమిగా అధికారిక రికార్డుల్లో నిర్ధారించబడిందా..? నిర్ధారించబడితే, ఆ తర్వాత ఆ భూమిపై ప్రైవేట్ నిర్మాణాలకు సంబంధించి ఏవైనా చర్యలు జరిగాయా..? జరిగితే వాటికి ఎవరు అనుమతులు ఇచ్చారు..? సంబంధిత శాఖలు ఏం పరిశీలించాయి..? అనే ప్రశ్నలకు సమాధానాలు అవసరం. ప్రభుత్వ భూమి విషయంలో ఒకవైపు అధికారిక రికార్డులు ఒక విషయం చెబుతుంటే.. మరోవైపు అదే భూమిపై ప్రైవేట్ కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వస్తే, వాటిపై రెవెన్యూ అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
-
అధికారుల నుంచి స్పష్టత రావాల్సిందే..
ఆర్.డీ.ఓ. ఆదేశాల ప్రకారం 15 రోజుల్లో పాయింట్ వారీ సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ, సమాచారం ఇంకా పూర్తిగా అందకపోవడంపై దరఖాస్తుదారు మరోసారి అప్పీల్ అథారిటీని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు రికార్డులు ఏమంటున్నాయి..? సర్వే నంబర్ 27/1 భూమి వాస్తవ స్థితి ఏమిటి..? కనెక్టెడ్ ఫైల్ నంబర్ ఎందుకు బయటకు రావడం లేదు..? 1955–2016 పహాణీల తర్వాతి రికార్డులు ఏమయ్యాయి..? ప్రభుత్వ భూమి అయితే ప్రైవేట్ కమర్షియల్ నిర్మాణాలకు ఎలా అవకాశం ఏర్పడింది..? ఈ ప్రశ్నలకు సంబంధిత రెవెన్యూ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
