Homeక్రైమ్కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి - ఎస్పీ పవార్

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి – ఎస్పీ పవార్

  • పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి

  • దేవరకొండ డీఎస్పీ, డిండి సీఐ కార్యాలయాలను వార్షికం తనిఖీ చేసిన ఎస్పీ పవార్

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం దేవరకొండ డీఎస్పీ కార్యాలయం, డిండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కార్యాలయాల్లోని వివిధ రికార్డులు, క్రైమ్ రికార్డులు, పరిపాలనా రికార్డులు, పెండింగ్ కేసుల ఫైల్స్‌తో పాటు కేసుల దర్యాప్తు పురోగతిని ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఫైల్స్‌ను సవివరంగా పరిశీలించి, ఆయా కేసుల్లో దర్యాప్తు ఏ దశలో ఉందో, సేకరించిన ఆధారాలు, నిందితుల అరెస్టు, చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ సూచించారు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు వంటి తీవ్ర స్వభావం కలిగిన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు.

ప్రతి కేసులో సంఘటనా స్థలం నుంచి లభించే ఆధారాలను శాస్త్రీయంగా సేకరించి, సాక్ష్యాలను పటిష్టంగా నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని, కేవలం కేసును ఛేదించడమే కాకుండా కోర్టులో నేరం రుజువయ్యే విధంగా నాణ్యమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసుకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, కేసుల దర్యాప్తులో ఆధునిక పద్ధతులను అనుసరించాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పవార్ సూచించారు.

తమ పరిధిలోని సమస్యాత్మక, నేర ప్రభావిత, సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే పరిశీలించి చట్టపరమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం కలిగేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని శరత్ చంద్ర పవార్ సూచించారు.

నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, ముందస్తు చర్యల ద్వారా నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు, క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ చేసిన సూచనలు పోలీస్ శాఖ పనితీరును మరింత మెరుగుపరిచేలా ఉన్నాయి.

కేసుల దర్యాప్తులో నాణ్యత, ప్రజలకు వేగవంతమైన సేవలు, నేరాల నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత పట్ల పోలీస్ వర్గాల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఈ వార్షిక తనిఖీలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డిండి సీఐ బిసన్నతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు