Homeజాతీయంమూడేళ్ల చిన్నారికి టీచర్ చిత్రహింసలు

మూడేళ్ల చిన్నారికి టీచర్ చిత్రహింసలు

క్రైమ్ మిర్రర్ : అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ అమానుషంగా ప్రవర్తించింది. చిన్నారి చేతులను నైలాన్ తాడుతో కట్టేసి దాడికి పాల్పడిన ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో కలకలం రేపింది. పాఠశాల తరగతి గదిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. తిరుత్తరాయ్‌పూండిలోని సాయిరాం మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో బాధిత బాలుడు ప్రీ-కేజీ చదువుతున్నాడు. మంగళవారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి శరీరంపై గాయాలను గమనించిన తల్లిదండ్రులు గోపీనాథ్, మహిమ ఆందోళనకు గురయ్యారు. బాలుడిని ప్రేమగా ప్రశ్నించగా, తన టీచర్‌తో పాటు స్కూల్ సహాయకురాలు తన చేతులను తాడుతో కట్టేసి కొట్టినట్లు తెలిపాడు.

దీంతో వెంటనే పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో టీచర్ చిన్నారి చేతులను నైలాన్ తాడుతో కట్టివేయడం కనిపించింది. మరోవైపు పాఠశాల సహాయకురాలు కూడా బాలుడిని ఓ స్క్రీన్‌పై అదిమిపెట్టి ఉంచినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన తండ్రి గోపీనాథ్ సీసీటీవీ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసుకున్నారు. అనంతరం తిరుత్తరాయ్‌పూండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, చిన్నారిపై దాడికి పాల్పడిన వారితో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి టీచర్ భాగ్యలక్ష్మి (26), స్కూల్ అసిస్టెంట్ సెల్వి (55)లను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చిన్నారి చేతులు కట్టేసిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూడేళ్ల పసిపాపపై ఇలాంటి చర్యకు పాల్పడటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
also read : గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో గంజాయి కలకలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు