Homeతెలంగాణవెనక్కి తగ్గని అనిరుధ్ రెడ్డి...! సొంత ప్రభుత్వం పైనే విమర్శలు...

వెనక్కి తగ్గని అనిరుధ్ రెడ్డి…! సొంత ప్రభుత్వం పైనే విమర్శలు…

  • అన్ని శాఖల్లో అవినీతి పెరుగుతోందని వ్యాఖ్యలు

  • దూకుడు పెంచిన జడ్చర్ల ఎమ్మెల్యే

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో క్రమశిక్షణ కొరవడుతోంది. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దూకుడు ఎంత మాత్రం తగ్గడం లేదు. గత కొంతకాలంగా నిధుల విడుదల విషయంలోనూ, పరిపాలనలో జరుగుతున్న లోపాలపైన సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వస్తున్నారు. తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతిపై మరోసారి బహిరంగంగానే బాంబు పేల్చారు. జడ్చర్ల కార్యాలయంలో ఒక వారసత్వ భూమి మ్యూటేషన్ కోసం తాము స్వయంగా ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదని.. అదే పనికి 15 వేల రూపాయలు లంచం ఇవ్వగానే క్షణాల్లో ఫైల్ కదిలిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కిందిస్థాయి అధికారులు లంచాలకు మరిగితే తాను మాత్రం ఎంత నిజాయితీగా ఉండి ఏం లాభం అని ఆయన చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల విషయంలో బాహటంగా వ్యాఖ్యానించిన ఆయన.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి లంచం, అవినీతి ప్రస్తావనలు చేస్తుండడం సంచలనంగా మారింది.

అన్ని శాఖల్లో అవినీతి ఉందంటూ…

రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో అవినీతి దందా కొనసాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు అనిరుధ్ రెడ్డి. ఐదు లక్షల రూపాయల విలువైన సిమెంట్ రోడ్డు బిల్లుల మంజూరు చేయడానికి అధికారులు 10 నుంచి 20 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. పనులకు ముందే ప్రభుత్వం సీనరేజ్ చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ.. అధికారుల వేధింపులు, కమీషన్ల దాహం తట్టుకోలేక కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ప్రతిరోజు లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు అక్రమ వసూలు జరుగుతున్నాయని ఆరోపించారు. కిందిస్థాయి యంత్రాంగం చేస్తున్న ఈ లంచగొండితనం వల్ల అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని హెచ్చరించారు. పాలకులు ఎంత మంచి చేయాలని ప్రయత్నించినా క్షేత్రస్థాయిలో వ్యవస్థ గాడి తప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా అవినీతి బాగోతాలను మీడియా ప్రతినిధులు వెలికి తీయాలని పిలుపునిచ్చారు. కథనాలు ప్రచురితమైతే సంబంధిత అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.

నిత్యం అసంతృప్తి…

ఇటీవల అనిరుధ్ రెడ్డి నిత్యం అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల నియోజకవర్గానికి నిధుల విడుదల విషయంలో మంత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఇప్పుడు నేరుగా అధికారుల కమీషన్ల దందాను బయట పెట్టడం గాంధీభవన్ లో కలకలం రేపుతోంది. క్రమశిక్షణ కమిటీ పేరుతో పార్టీ నాయకత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా సొంత ప్రభుత్వంలోని లొసుగులను అనిరుధ్ రెడ్డి ఎండగడుతుండడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు