-
అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం
-
అందుకే తాడేపల్లి కి దూరంగా?
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఇబ్బందికర పరిణామం. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అసిస్టెంట్ కె నాగేశ్వర్ రెడ్డి త్వరలో అరెస్టు కాబోతున్నారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి దూరంగా ఉన్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. కేఎన్ఆర్ గా పిలవబడే నాగేశ్వర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో షెల్ కంపెనీలు, బినామీల పేర్లతో వందల కోట్ల రూపాయల విలువైన భూ దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుండడం వైసిపి వర్గాల్లో గుబులు రేపుతోంది.
ఎప్పటినుంచో సహాయకుడిగా…
రాజకీయంగా ఎప్పటినుంచో జగన్మోహన్ రెడ్డికి సహాయకుడిగా ఉన్నారు నాగేశ్వర్ రెడ్డి. ఈ తరుణంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో రూ.250 కోట్ల విలువైన భూమిని, విజయవాడ శివారులో రియల్టర్న్ బెదిరించి 5400 గజాల స్థలాన్ని, తిరుపతి సమీపంలోని కేవీపీ పురం వద్ద అతి తక్కువ ధరకు పది ఎకరాల భూమిని తన భార్య పేరుతో కొనుగోలు చేసినట్లు సీట్ దర్యాప్తులో వెలుగు చూసింది. అంతేకాకుండా ఆయన సన్నిహితుడు, బినామీగా భావిస్తున్న కుందూరు రమణారెడ్డి ఇప్పటికే దేశం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేఎన్ఆర్ ను కూడా తాడేపల్లి ప్యాలెస్ కు దూరంగా ఉండాలని సూచించినట్లు చెబుతున్నారు. సీట్ దర్యాప్తులో వెలికి తీసిన అక్రమ ఆస్తులు, మనీలాండరింగ్ కోణాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ సేకరించి కేసులు నమోదు చేసే అవకాశం ఉందని వైసిపి వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థల కదలికలు ముదురుతున్నందున ప్రస్తుతానికి తాడేపల్లి ప్యాలెస్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కేఎన్ఆర్ కు సూచనలు అందినట్లు ప్రచారం నడుస్తోంది.
కొట్టిపారేస్తున్న వైసిపి…
అయితే కేఎన్ఆర్ ఎక్కడికి పారిపోలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అజ్ఞాతంలో వెళ్లిపోయారు అనేది కేవలం ప్రభుత్వ అనుకూల మీడియా సృష్టి అని.. కట్టు కథ మాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిట్ విచారణకు ఆయన పూర్తిస్థాయిలో సహకరించారని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా లేనిపోని కథనాలను ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు తాడేపల్లి లో చక్రం తిప్పిన కేఎన్ఆర్ చుట్టూ నడుస్తున్న ఈ పరిణామాలు.. ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారాయి.
