Homeజాతీయంహోటల్‌లో జంట పట్టుబాటు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని పోలీసుల బెదిరింపు!

హోటల్‌లో జంట పట్టుబాటు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని పోలీసుల బెదిరింపు!

క్రైమ్ మిర్రర్ : మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 13న ఏఎస్పీ దీపక్ మిశ్రా తన సిబ్బందితో కలిసి ఓ హోటల్‌పై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్‌లో బస చేస్తున్న ఓ జంటను పోలీసులు ప్రశ్నించారు. తాము ఇద్దరం మేజర్లమని, ఒకే కులానికి చెందినవారమని, త్వరలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నామని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. అయినప్పటికీ పోలీసులు వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అయితే తన ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడానికి ఆమె నిరాకరించింది.

ఈ క్రమంలో ఏఎస్పీ దీపక్ మిశ్రా ఆ జంటను డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. యువకుడి బ్యాగులో గంజాయి పెట్టాలని తన సిబ్బందికి సూచించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. అంతేకాకుండా ఆ జంటను డబ్బులు అడిగినట్లు, వారిపై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు, పోలీసులు తనను ప్రతి నెలా రూ.25 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారని హోటల్ యజమాని ఆరోపించారు. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు నిరాకరించడంతోనే తన హోటల్‌పై దాడి చేసి, అక్కడ బస చేస్తున్న జంటను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. పోలీసుల అక్రమ వ్యవహారాలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీసీటీవీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు హోటల్ యజమాని వెల్లడించారు.
also read : తుఫాన్ నష్టం రూ. 7 వేల కోట్లు: నిర్మలా సీతారామన్‌ను కలిసి సీఎం చంద్రబాబు వినతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు