-
సీఎం సామ్రాట్ చౌదరి బలహీన ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు
-
త్వరలో ఆయన మార్పు ఉంటుందని కామెంట్స్
-
బీహార్ రాజకీయాల్లో కొత్త రూట్లో ప్రశాంత్ కిషోర్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: బీహార్‌లో తనకంటూ ఒక మార్కు చూపుకుంది భారతీయ జనతా పార్టీ. మిత్రుడు నితీష్ కుమార్ ను దాటుకుని అధికారాన్ని అందుకుంది. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే జన సూరజ్ పార్టీ బిజెపిని కలవరపరుస్తోంది. బంకిపూర్ నియోజకవర్గం నుంచి గెలిచినప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం సామ్రాట్ చౌదరిని బిజెపి అధిష్టానం త్వరలోనే గద్దె దించి మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన చెప్పుకొస్తున్నారు. పైకి ఇది కేవలం ఒక సాధారణ రాజకీయ విమర్శల, అధికార పార్టీపై దాడిలా కనిపిస్తున్నప్పటికీ.. దీని వెనుక పీకే ఒక అత్యంత లోతైన రాజకీయ ఎత్తుగడను అమలు చేస్తున్నారని భావించవచ్చు. రాబోయే నాలుగేళ్ల పాటు సామ్రాట్ చౌదరిని బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రశాంత్ కిషోర్ అంతర్గతంగా కోరుకుంటున్నారు. దీనికి బలమైన రాజకీయ కారణం ఉంది.
కేవలం ఆ వ్యూహంతో…
బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో బిజెపికి చెందిన సామ్రాట్ చౌదరి సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు. సామ్రాట్ చౌదరి ఒక బలహీనమైన ముఖ్యమంత్రిగా బీహార్ ప్రజలకు చూపించాలన్నదే ప్రశాంత్ కిషోర్ ఆలోచన. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలను ఆకట్టుకునేలా ఆయన ఎలాంటి గొప్ప పాలనా ఫలితాలను అందించలేరని ప్రశాంత్ కిషోర్ గట్టిగా నమ్ముతున్నారు. పాలనాపరమైన వైఫల్యాలు, బలహీన నాయకత్వం కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సామ్రాట్ చౌదరిని లక్ష్యంగా చేసుకోవడం జన సూరజ్ పార్టీకి అత్యంత సులభమైన పనిగా మారనుంది. అందుకే అసలైన వ్యూహాన్ని ప్రయోగిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. తనకు ఏది రాజకీయంగా లాభము దానికి పూర్తిగా విరుద్ధమైన డిమాండ్‌ను ఆయన బహిరంగంగా వినిపిస్తున్నారు.
రెండు రకాల వ్యూహాలతో…
భారతీయ జనతా పార్టీ సామ్రాట్ చౌదరిని మార్చక తప్పదు అని పీకే పదే పదే ప్రకటించడం ద్వారా.. కమలం పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో నెట్టేశారు. దీనివల్ల ఇప్పుడు బీజేపీ ముందు కేవలం రెండు మార్గాలు మాత్రమే మిగిలాయి. అందులో ఏది ఎంచుకున్నా అంతిమంగా ప్రశాంత్ కిషోర్ కే రాజకీయ ప్రయోజనం చేకూరేలా ఉంది. పాలన వైఫల్యాలు లేదా పీకే విమర్శల ఒత్తిడికి తలొగ్గి బిజెపి నిజంగానే సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే.. ప్రశాంత్ కిషోర్ ప్రజల్లోకి వెళ్లి నేను ముందే చెప్పాను కదా అంటూ ప్రచారం చేసుకుంటారు. సామ్రాట్ చౌదరి అసమర్ధ సీఎం అని బిజెపి అధిష్టానమే ఒప్పుకుంది అని క్రెడిట్ తీసుకుంటారు. ఒకవేళ సామ్రాట్ చౌదరిని మిగతా నాలుగేళ్లు కొనసాగిస్తే.. ప్రశాంత్ ఆశించినట్టుగా జరుగుతుంది. బలహీనమైన ప్రత్యర్థి తో వచ్చే ఎన్నికల్లో తలపడే అవకాశం దక్కుతుంది.
