ప్రపంచ వారసత్వ వారోత్సవాల (World Heritage Week) సందర్భంగా పర్యాటకులకు భారత పురావస్తు శాఖ (ASI) శుభవార్త అందించింది. ఈ వేడుకల్లో భాగంగా నవంబర్ 19న దేశంలోని ప్రముఖ చారిత్రక కట్టడాలైన తాజ్‌మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీలను సందర్శించేందుకు పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ప్రకటించింది. దీంతో చారిత్రక ప్రదేశాలను సందర్శించాలనుకునే పర్యాటకులకు ఇది మంచి అవకాశంగా మారనుంది.
మరోవైపు తాజ్‌మహల్ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు సాధారణ సీసీటీవీ కెమెరాల నిఘాకు అందని ప్రాంతాలను కూడా పర్యవేక్షించేలా 360 డిగ్రీల కెమెరాలతో పాటు అదనపు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఇతర కీలక ప్రదేశాలపై నిరంతర నిఘా ఉంచడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
అంతేకాకుండా పర్యాటకులకు మార్గనిర్దేశం చేసే టూరిస్ట్ గైడ్లను గుర్తించడం మరింత సులభతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం గైడ్లకు వేర్వేరు రంగుల్లో ఐడీ కార్డులు అందించనున్నారు. దీనివల్ల అధికారికంగా గుర్తింపు పొందిన గైడ్లను పర్యాటకులు సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఒకవైపు ప్రపంచ వారసత్వ సంపదను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఉచిత ప్రవేశం కల్పిస్తూనే, మరోవైపు తాజ్‌మహల్ భద్రత, పర్యాటకుల సౌకర్యాల మెరుగుదలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
also read: అత్తతో చిన్నపాటి వివాదం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య!
