-
రాహుల్ గాంధీ భారీ ప్రకటనలు
-
అమలులో తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల వెనుకబాటు
-
ఎన్నికల స్టంట్ అంటూ కొట్టి పారేస్తున్న విపక్షాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఇటీవల గిగ్ వర్కర్ల సమ్మేళనానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. వారికి ఐదు లక్షల ప్రమాద బీమా, పది లక్షల ఆరోగ్య బీమా, వైఫై సౌకర్యాలతో కూడిన విశ్రాంతి కేంద్రాలు కల్పిస్తామని.. వారి కుటుంబాల విద్య, వైద్య బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ భారీ ప్రకటనలు గత ఎన్నికల ప్రచారంలోనూ చేశారు. మరి మూడేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలో ఎందుకు అమలు చేయలేకపోయారని.. వారికి ఎందుకు ప్రయోజనాలు కల్పించలేదన్న ప్రశ్న ఇప్పుడు బలంగా తెరపైకి వస్తోంది.
మూడేళ్ల కిందట…
2023 డిసెంబర్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ గిగ్ వర్కర్లకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. వారి సంక్షేమ చట్టం కేవలం కాగితాలు, వాయిదాలకు పరిమితం అయిందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఎన్నికలకు ముందు అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం జరిగింది. కనీసం కార్మిక శాఖకు పూర్తిస్థాయిలో మంత్రిని నియమించడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. ఏప్రిల్ 2026 లో గవర్నర్ ఆమోదం పొందిన తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టం జూన్ 2న లాంచనంగా ప్రారంభమైంది. కానీ వీధి విధానాలు ఖరారు కాకపోవడంతో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కార్మికులకు అందలేదు. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన కోసమే హడావుడిగా నిబంధనలు విడుదల చేశారే తప్ప.. గత మూడేళ్లలో ప్రమాదాలకు గురైన వందలాదిమంది డెలివరీ బాయ్స్ కుటుంబాలకు ప్రభుత్వపరంగా అందిన భరోసా శూన్యం.
కర్ణాటకలో సైతం…
2023 మేలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ కూడా లక్షలాదిమంది వర్కర్లు పనిచేస్తున్నారు. అక్కడ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. 2025 ఆగస్టులో కర్ణాటక ప్లాట్ఫారం బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లును ఆమోదించి.. 2026 ఫిబ్రవరిలో అగ్రిగేటర్ కంపెనీల నుంచి ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు సంక్షేమ రుసుము వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ క్షేత్రస్థాయిలో దాని అమలు నత్తనడకన సాగుతోంది. సంక్షేమ రుసుము వసూలు కోసం ఉద్దేశించిన పేమెంట్ అండ్ వెల్ఫేర్ ఫ్రీ వెరిఫికేషన్ సిస్టం పోర్టల్ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కంపెనీలు స్వచ్ఛందంగా లెక్కలు చూపి డబ్బులు జమ చేయాలనే నిబంధన పెట్టడంతో.. అగ్రిగెటర్ల నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడం, కార్మికుల యూనిక్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మందకుడిగా సాగడం విమర్శలకు భావిస్తోంది.
రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్. కానీ అక్కడే అమలు చేయకుండా రాహుల్ అలా ప్రకటనలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఆరోగ్యారెంటీల అమలులోనే తడబడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు గిగ్ వర్కర్ల కుటుంబాల విద్య, వైద్య బాధ్యతలను కూడా తీసుకుంటామని రాహుల్ గాంధీతో కొత్త హామీలు ఇప్పించడం కేవలం రాజకీయ ప్రచార ఆర్భాటం మాత్రమే. ఇదే విషయంపై కేటీఆర్ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు కొనసాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎన్నికల స్టంట్ అని గిగ్ వర్కర్స్ సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు.
