-
రెండో విడత మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల
-
రెండు కార్పొరేషన్ల మేయర్, మూడు మున్సిపాలిటీల చైర్మన్ అభ్యర్థుల ప్రకటన
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంది. ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు నాలుగు మేయర్ పదవులతో పాటు 21 మున్సిపల్, నగర పంచాయతీ చైర్మన్ పదవులను కేటాయించిన సంగతి తెలిసిందే. ఏపీలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలలో 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు గాను జనసేనకు ఈ వాటా దక్కింది. ఈనెల 1న తొలి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. వివిధ కారణాలతో వాయిదా పడిన మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు ఈనెల 26న పోలింగ్ జరగనుంది.
ప్రత్యేక ప్రకటన…
జనసేనకు కేటాయించిన నాలుగు కార్పొరేషన్లకు సంబంధించి.. ఇప్పటికే రెండు కార్పొరేషన్ల ఎన్నిక పూర్తయింది. మిగిలిన రెండు కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను తాజాగా ఎంపిక చేస్తూ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన ప్రత్యేక ప్రకటన చేసింది. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధా రాణి, కాకినాడ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవాని పేర్లు ఖరారు చేశారు. రాజాం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్యలత, భీమవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లిగూడెం చైర్మన్ అభ్యర్థిగా పాలూరి వెంకటేశ్వరరావు పేర్లను ఎంపిక చేశారు. మొదటి దశలో జనసేన పోటీ చేసిన 15 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల చైర్మన్ స్థానాలన్నింటిలోనూ ఘనవిజయం సాధించింది. పిఠాపురం, గొల్లప్రోలు, తుని, నిడదవోలు, నరసాపురం, పెడన, తిరువూరు, చిలకలూరిపేట, సాలూరు, అమలాపురం, సామర్లకోటలో జనసేన విజయం సాధించింది. విజయవాడ, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవులను సైతం జనసేన సొంతం చేసుకుంది. ఇప్పుడు రెండో విడతలో కూడా శతశాతం విజయాలు దక్కించుకోవాలన్న ఆలోచన కనిపిస్తోంది.
పోటీ రసవత్తరం…
శ్రీకాకుళం కార్పొరేషన్ లో పోటీ రసవత్తరంగా జరగనుంది. ఇక్కడ వైసిపి తరఫున మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి బరిలో నిలవనున్నారు. ఈమె గతంలో టిడిపి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆమె కుటుంబం సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగేది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. ఆపై మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ కార్పొరేషన్ ను జనసేనకు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ అభ్యర్థిగా మారిపోయారు.
