-
దేవతామూర్తులతో పాటు ఆమె విగ్రహం సైతం
-
ఆదోనిలో బిజెపి నేతల స్వామి భక్తి
-
గుడి నిర్మాణంలో వైసీపీ నేతలు సైతం..
క్రైమ్ మిర్రర్,, ఏపీ బ్యూరో: రాజకీయ విధేయత, అభిమానం కొన్ని రాష్ట్రాల్లో చూస్తుంటాం. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నాయకులను ఆరాధిస్తుంటారు. తమిళనాడులోని ఇటువంటి ఆరాధన భావం ఎక్కువే. అయితే ఇప్పుడు ఆ సరసన మన తెలుగు వారు కూడా చేరారు. కొత్త పుంతలు తొక్కుతూ జాతీయస్థాయిలో రికార్డు సృష్టిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గుడేకల్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్ మోదీ పేరుతో ఓ భారీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు అర ఎకరం స్థలంలో పాలరాతి విగ్రహంతో నిర్మిస్తున్న ఈ మాత శ్రీ మందిరానికి ఆదోని బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి స్వయంగా భూమి పూజ చేశారు. విధేయత ప్రదర్శనలు తెలుగువారు తక్కువ కాదు అని చాటి చెప్పారు.
రాజకీయ వైరం మరిచి…
ఈ ఆలయ నిర్మాణంలో మరో విశిష్టత దాగివుంది. రాజకీయ వైరాన్ని మరిచి వైసిపి నాయకులు సైతం ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అయితే ఇక్కడ టిడిపి కంటే కమలం, గ్లాసు, ఫ్యాన్ పార్టీల స్థానిక నేతలు ఒక్కటై ప్రధాని మాతృమూర్తికి గుడి కట్టి బృహత్తర కార్యక్రమానికి జై కొట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నియోజకవర్గంలో మౌలిక వసతులకు నిధులు లేవు కానీ.. ఢిల్లీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రం పార్టీలకు అతీతంగా చందాలు వేసుకుని మరి గుడులు కట్టేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
ప్రత్యేకంగా విగ్రహం…
అయితే కొత్తగా నిర్మిస్తున్న ఈ ఆలయంలో ప్రధాని తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్టిస్తున్నారు. శివుడు, రాముడు, వినాయకుడి మందిరాలతో పాటు ప్రధాని తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్టిస్తుండడం విశేషం. మరోవైపు నిర్వాహకులు ఈ ప్రాంగణంలో గోశాల, అనాధాశ్రమం కూడా నిర్మిస్తున్నామని సేవా రంగు పులుముతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇది పక్కా రాజకీయ భక్తి ప్రదర్శన గానే కనిపిస్తోంది.
తమిళనాడుకు క్రాస్…
రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులకు తమిళనాడులో ఎక్కువగా గుడులు కడుతుంటారు. ఆ సంస్కృతి ఏపీలో మాత్రం లేదు. ఇప్పుడు బిజెపి దానికి తెరలేపింది. అయితే ఇది రాజకీయ విధేయత కోసమే చేస్తున్న పని అని సెటైర్లు పడుతున్నాయి. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా కేంద్రంలోని పెద్దల గుడ్ లుక్స్ లో పడాలంటే ఏ స్థాయి కైనా వెళ్ళవచ్చని ఆదోని నేతలు నిరూపించారు. మొత్తానికి అయితే అభివృద్ధి పనుల విషయంలో ఎప్పుడూ విభేదించుకునే మూడు పార్టీల నేతలు.. ప్రధాని తల్లికి ఆలయం కట్టే విషయంలో మాత్రం తమ ఐక్యత చాటుకున్నారు.
