-
సోనియా ఆత్మకథ తో పుంజుకోవాలని చూస్తున్న హస్తం
-
దేశవ్యాప్తంగా ప్రమోషన్స్
-
సరికాదంటున్న విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ఒకే ఒక్క పుస్తకంతో దేశ రాజకీయాన్ని ఈదేయాలనుకుంటోంది కాంగ్రెస్. కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బి లాగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని రాజకీయ అస్త్రంగా మార్చేందుకు కాంగ్రెస్ యంత్రాంగం తపన పడుతోంది. ఓవైపు సోనియా గాంధీ ఇన్స్టాగ్రామ్ లో అడుగుపెట్టి మరి తన పుస్తకాన్ని ప్రమోట్ చేస్తుండగా.. మరోవైపు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఏకంగా పార్టీ కార్యకర్తల నుంచి విరాళాలు సేకరించి ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని.. బయోపిక్ సినిమా నిర్మించాలని టిపిసిసి నేతలు ఉత్సాహం చూపుతున్నారు. క్విక్ కామర్స్ యాప్ ల నుంచి ప్రాంతీయ భాషల అనువాదాల వరకు కాంగ్రెస్ చేస్తున్న ఈ హడావిడి చూస్తుంటే.. ఎన్నికల సముద్రాన్ని కేవలం ఒక పుస్తకాన్ని పట్టుకొని ఈదేయాలని హస్తం పార్టీ కలలు కంటోంది.
అదో కుటుంబ కథ…
సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ అనేది ఒక భావోద్వేగ ఫలితమైన కుటుంబ కథ తప్ప.. అందులో సమకాలీన రాజకీయాలకు పనికొచ్చే నిజాయితీ పూరిత ఆత్మ పరిశీలన లేదని ఎక్కువమంది అభిప్రాయం. ముఖ్యంగా యుపిఏ హయాంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన అవినీతి ఆరోపణలు, బంధుప్రీతి వంటి కీలక అంశాలను సోనియా గాంధీ వ్యూహాత్మకంగా దాటవేశారని.. పైగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ అని.. ఆర్ఎస్ఎస్ 1921లో స్థాపించబడిందని.. మహమ్మద్ పటేల్ 2022లో మరణించారని దాదాపు 15కు పైగా చారిత్రక, వాస్తవ తప్పిదాలు ఈ పుస్తకంలో దొరిలాయి. వీటిపై జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి.
సెంటిమెంట్ అస్త్రం…
కేవలం సెంటిమెంటును నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ సెంటిమెంట్ తోనే ప్రజలకు టోపీ పెట్టాలని చూస్తోంది. కానీ భారతదేశ ఓటర్ల ఆలోచన విధానం గత రెండు దశాబ్దాలుగా పూర్తిగా మారిపోయిన విషయాన్ని మరిచిపోయింది. 1998- 2004 మధ్యకాలంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల త్యాగాలు, 2004లో ప్రధాని పదవిని త్యాగం చేయడం వంటి సెంటిమెంట్ అంశాలు ఓటర్లను కదిలించి ఉండవచ్చు. కానీ నేటి డిజిటల్ యుగంలో.. 2026 నాటి యువ ఓటర్లు కేవలం గతాన్ని, కుటుంబ త్యాగాలను, కన్నీటి గాథలను చూసి ఓట్లు వేసే స్థితిలో లేరు. పాలనా సామర్థ్యం, అభివృద్ధి నమూనా, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్తుపై స్పష్టమైన భరోసా ఇచ్చే నాయకత్వాన్ని నేటి సమాజం విశ్వసిస్తుంది.
అది కేవలం తాత్కాలికం…
సోనియా ఆత్మకథ పుస్తకం చుట్టూ మీడియా సృష్టించే హైప్ కేవలం తాత్కాలికమైన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలి. ఆ పుస్తకాన్ని పోటాపోటీగా కొనుగోలు చేస్తూ సోషల్ మీడియాలో ఎంత హడావిడి చేసినా.. మరో ఆరు నెలల తర్వాత ఈ పుస్తకం పూర్తిగా పాతబడిపోవడం ఖాయం. సామాన్య ఓటరు రోజువారి జీవితంలోని ధరల పెరుగుదల, ఉపాధి అవకాశాలు వంటి వాస్తవ సమస్యలకు పరిష్కారం చూపకుండా, కేవలం అగ్రనేతల ఆత్మకథను ఇంటింటికి పంచడం వల్ల క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు ఏమాత్రం పెరగదు. సంస్థాగత బలహీనతలను, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణ లోపాలను సరిదిద్దుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ.. అందుకు భిన్నంగా సెంటిమెంట్ రాజకీయాలపైనే ఆశలు పెట్టుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.
