క్రైమ్ మిర్రర్ : రెండున్నరేళ్ల చిన్నారిని అపహరించిన మహిళను అమీన్‌పూర్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలిక అక్షితను క్షేమంగా రక్షించి తల్లి చెంతకు చేర్చారు. ఈ కేసును వేగంగా ఛేదించడంలో ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు కీలక పాత్ర పోషించాయి. కేసు వివరాలను శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ గురువారం గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌లో నివాసం ఉంటున్న ఎరుకల సరిత (25) స్థానికంగా ఓ టిఫిన్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఈ నెల 18న మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో ఆమె పనికి వెళ్లగా, ఇంటి వద్ద ఉన్న రెండున్నరేళ్ల కుమార్తె అక్షిత కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు అమీన్‌పూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు
చిన్నారి కిడ్నాప్ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమీన్‌పూర్, చందానగర్, పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు ఎస్‌ఓటీ పోలీసులను కలిపి మొత్తం 25 మందితో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చిన్నారిని వీలైనంత త్వరగా గుర్తించి సురక్షితంగా తల్లి వద్దకు చేర్చడమే లక్ష్యంగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో అందుబాటులో ఉన్న ఆధారాలను విశ్లేషించిన పోలీసులు ఓ అనుమానాస్పద మహిళ చిన్నారిని ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు గుర్తించారు. తదుపరి విచారణలో ఆమె మెదక్ ప్రాంతానికి చెందిన గంగామణి (44)గా నిర్ధారించారు. గతంలో ఆమె ఇంటి పనిమనిషిగా పనిచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మెదక్‌లో నిందితురాలి అరెస్ట్
సాంకేతిక ఆధారాలు, సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మెదక్ టౌన్ పోలీసుల సహకారంతో అమీన్‌పూర్ పోలీసులు నార్సింగ్‌ఖేడ్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ నిందితురాలు గంగామణిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న చిన్నారి అక్షితను క్షేమంగా రక్షించి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఎస్‌ఓటీ బృందాల సమన్వయంతో కిడ్నాప్ జరిగిన 12 గంటల్లోనే కేసును ఛేదించి చిన్నారిని సురక్షితంగా రక్షించడం విశేషం. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అమీన్‌పూర్, చందానగర్, పటాన్‌చెరు పోలీసు సిబ్బంది, ఎస్‌ఓటీ బృందాల పనితీరును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించినట్లు డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.
also read : ఇండిగో ఉద్యోగిని హత్య వెనుక స్నేహితుడి భార్య కుట్ర!
