క్రైమ్ మిర్రర్ ; బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి, నేరాన్ని నిరూపించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ అభినందించి సత్కరించారు.
వివరాల్లోకి వెళితే.. 2021లో 14 ఏళ్ల బాలికపై మంజూర్ అహ్మద్ అబ్రార్ అనే వ్యక్తి రెండు వేర్వేరు సందర్భాల్లో లైంగిక దాడికి పాల్పడినట్లు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి క్రైమ్ నంబర్ 64/2021, 378/2021 కింద రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై అప్పటి ఐపీసీ నిబంధనలు, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు.
ఈ కేసులపై విచారణ చేపట్టిన నాంపల్లిలోని 12వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అర్చన కుమారి. ఎం 16-11-2024న తీర్పు వెలువరించారు. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.
దర్యాప్తు నుంచి తీర్పు వరకు పోలీసుల కృషి
కేసులో నేర నిరూపణకు అవసరమైన ఆధారాల సేకరణ, విచారణ, న్యాయస్థానంలో సమర్థవంతమైన వాదనలకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారు. దర్యాప్తు అధికారి ఎన్. వెంకట రమణ, అదనపు డీసీపీ, ఉప్పల్ జోన్ (గతంలో మలక్పేట ఏసీపీ), ప్రత్యేక అదనపు ప్రభుత్వ న్యాయవాదులు జె. రామకృష్ణ, ఎ. రాంరెడ్డి, న్యాయ సలహాదారులు టి. కల్పన, ఎ.ఆర్. హిమ మీనన్, కోర్టు డ్యూటీ అధికారులు ఎన్. గంగరాజు (పీసీ 9872), కె. సాయిరాం (పీసీ 30100), మల్లేష్ (పీసీ 5299)లను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే న్యాయపరమైన ప్రక్రియలో సహకరించిన కౌన్సిలర్ నౌషీన్ బేగం సేవలను కూడా అధికారులు ప్రశంసించారు.
పోలీసు బృందానికి ఘన సన్మానం
చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, అదనపు డీసీపీ ఎం.డి. మజీద్, సైదాబాద్ ఏసీపీ సోమ వెంకట్ రెడ్డిల పర్యవేక్షణలో ఈ కేసు విచారణ కొనసాగింది. నిందితుడికి శిక్ష పడేలా పటిష్టమైన ఆధారాలను న్యాయస్థానంలో సమర్పించి, కేసు పరిష్కారానికి కృషి చేసిన పోలీసు బృందాన్ని డీసీపీ శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నేరాల దర్యాప్తులో నాణ్యత, పక్కా సాక్ష్యాధారాల సేకరణ, సాక్షుల సమన్వయం, న్యాయస్థానంలో సమర్థవంతమైన కేసు నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్థులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా ప్రతి పోలీసు అధికారి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. నేరస్థులకు శిక్ష పడేలా పోలీసులు చేసే కృషి బాధితులకు న్యాయం అందించడమే కాకుండా, సమాజంలో చట్టంపై ప్రజలకు మరింత విశ్వాసాన్ని కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
also read : మూడేళ్ల చిన్నారికి టీచర్ చిత్రహింసలు
