క్రైమ్ మిర్రర్ ; ఇండిగో విమానయాన సంస్థలో పనిచేస్తున్న యువతి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెనుక మృతురాలి స్నేహితుడి భార్య ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తన భర్తతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తోందన్న కోపంతో యువతిని అంతమొందించేందుకు ఆమె రూ.13 లక్షలకు కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన 35 ఏళ్ల వర్ష తుర్కర్ పుణె విమానాశ్రయంలోని ఇండిగో టికెట్ కౌంటర్లో ఉద్యోగిగా పనిచేస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఇటీవల తన స్వగ్రామానికి వచ్చిన ఆమె నవంబర్ 14న తన స్నేహితుడు నితేశ్ అగర్వాల్‌తో కలిసి అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లింది.
సాయంత్రం ఇద్దరూ తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ముగ్గురు దుండగులు వారిని అడ్డగించారు. అనంతరం వర్షపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే నితేశ్ మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ ఆధారాలతో వెలుగులోకి కుట్ర
కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొలుత నితేశ్ వ్యవహారశైలిపై అనుమానం వ్యక్తం చేశారు. దాడిలో అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు ఘటనా స్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య వెనుక అసలు కుట్ర బయటపడింది.
వర్షతో నితేశ్‌కు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంతో ఆగ్రహానికి గురైన అతడి భార్య మోనా హత్యకు పథకం రచించినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం కిరాయి హంతకులతో రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
నలుగురు అరెస్ట్
నిందితుడి వాంగ్మూలం, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు నితేశ్ భార్య మోనాతో పాటు మరో ముగ్గురు కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు. వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
