Homeఆంధ్ర ప్రదేశ్కేంద్ర రాజకీయాల్లోకి పవన్...!

కేంద్ర రాజకీయాల్లోకి పవన్…!

  • జాతీయ భావంతో జనసేన విస్తరణ

  • భవిష్యత్తులో బలమైన శక్తిగా అవతరించేందుకు వ్యూహం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: జనసేన జాతీయ పార్టీగా అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించి ఢిల్లీ బాట పట్టాలని చూస్తోంది. పక్కా సమైక్యత భావంతో.. సనాతన ధర్మ పరిరక్షణ నినాదంతో తన పార్టీ పరిధిని విస్తరించాలని భావిస్తోంది. కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా.. జాతీయ పార్టీగా మారి.. జాతీయస్థాయిలో ప్రజా గొంతుకగా మారాలని చూస్తోంది. ఢిల్లీలో జరిగిన జనసేన పార్టీ అగ్రనాయకత్వ సమావేశాలతో స్పష్టమైన సంకేతాలు పంపారు పవన్ కళ్యాణ్. ఆయన కేవలం ఏపీ రాజకీయాల్లో మాత్రమే కాదు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆలోచనలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

  • నిర్దిష్టమైన సిద్ధాంతాలు..

పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఆయన ఏపీకి మాత్రమే పరిమితం కావాలని భావించడం లేదు. ఏపీలో పవర్ షేరింగ్ అంశం బయటకు వచ్చిన ప్రతిసారి ఆయన సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన ఆయన టార్గెట్ ఏపీ కాదు.. ఢిల్లీ అని చాలా సందర్భాల్లో కూడా స్పష్టమైనది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని ఒక్కసారి గమనిస్తే.. ఆయనకు కేవలం అధికారం, పదవులు కంటే నిర్దిష్టమైన సిద్ధాంతాలు, దేశభక్తి పట్ల ఉన్న నిబద్ధతి ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. భారతీయత అనే ఉమ్మడి సూత్రం, బలమైన జాతీయవాద భావజాలం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించిన తీరు, ఎంచుకున్న అంశాలు చూస్తుంటే ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో లేవు. దేశ భవిష్యత్తును కాన్క్షించే ఒక జాతీయ నాయకుడి ఆలోచన కనిపిస్తోంది.

  • నమ్మదగిన భాగస్వామిగా..

పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కీలక భాగస్వామి. కేవలం రెండు పార్లమెంటు సీట్లు మాత్రమే జనసేనకు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు, ఏపీ నుంచి బిజెపి ఓట్లు సీట్లు పెంచుకోవడం, మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని ఏపీకి అందించడం వెనుక.. పవన్ కృషి ఉన్న విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తించారు. అందుకే ఆయనను ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కేంద్ర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుంటూనే.. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ, సామాజిక సమతుల్యత, యువశక్తిని దేశ నిర్మాణం వైపు మళ్ళించడం వంటి అజెండాలతో జనసేన ను జాతీయస్థాయిలో విస్తరించాలన్నది పవన్ కళ్యాణ్ ప్రణాళికగా తెలుస్తోంది. పార్టీ విస్తరణకు ఇదే సరైన సమయం అని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమౌతోంది.

  • ఆ శూన్యత భర్తీ..

సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అంటే ఒక రాష్ట్రానికి పరిమితం అవుతాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యూహం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. దానికి కారణం లేకపోలేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి స్థిరపడిన వారు చాలా తక్కువ. ప్రాంతీయ పార్టీల ద్వారా వెళ్లినవారు పదవులకు పరిమితం అవుతున్నారే తప్ప తమ మార్కు రాజకీయాలు చేయడం లేదు. అందుకే పక్కా జాతీయ భావంతో పవన్ కళ్యాణ్ ఆ శూన్యతను భర్తీ చేసే పనిలో ఉన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో బలమైన శక్తిగా పనిచేసేందుకు పవన్ సిద్ధపడుతున్నట్లు అర్థం అవుతోంది. మున్ముందు ఏపీ రాజకీయాల్లో ఉంటూనే.. కేంద్రంలో కీలక శక్తిగా మారాలి అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా స్పష్టమవుతోంది. మరి ఈ విషయంలో ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు