క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తనపై నమోదైన పోక్సో (POCSO) కేసు విచారణకు బుధవారం (మే 13, 2026) హాజరుకాలేదు. ఈ విచారణకు హాజరు కావడానికి తనకు మరో రెండు రోజుల సమయం కావాలంటూ ఆయన సైబరాబాద్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా లిఖితపూర్వక సమాధానం పంపారు అని సమాచారం అందుతుంది.
షార్ట్ నోటీసు ఇవ్వడం మరియు వ్యక్తిగత ఇబ్బందుల వల్ల షెడ్యూల్ చేసిన సమయానికి హాజరు కాలేకపోయానని భగీరథ్ పేర్కొన్నారు. తనపై వచ్చిన “తప్పుడు ఆరోపణలను” తిప్పికొట్టేందుకు, అందుకు సంబంధించిన పత్రాలు మరియు సాక్ష్యాలను సేకరించడానికి సమయం కావాలని కోరారు.
నిందితుడు గత కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో, సైబరాబాద్ పోలీసులు ఆయనను గుర్తించేందుకు న్యూఢిల్లీ, కరీంనగర్ ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బాధితురాలి స్టేట్‌మెంట్‌ను తిరిగి రికార్డు చేసింది.
ఆమె ఇచ్చిన అదనపు వివరాల ఆధారంగా భగీరథ్‌పై తీవ్రమైన లైంగిక దాడిని సూచించే పోక్సో సెక్షన్ 5(I) read with 6 (Aggravated Penetrative Sexual Assault) అదనంగా చేర్చారు. దీనికి గరిష్టంగా 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై వెకేషన్ బెంచ్ నేడు (మే 14) విచారణ జరిపే అవకాశం ఉంది. ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై మోయినాబాద్‌లోని ఒక ఫార్మ్‌హౌస్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో బాధిత బాలిక తల్లి మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా, దీనికి కొన్ని గంటల ముందే బండి భగీరథ్ కరీంనగర్‌లో ఎదురు ఫిర్యాదు (కౌంటర్ కేసు) చేశారు. ఆ బాలిక కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ, రూ. 5 కోట్లు ఇవ్వాలని హనీట్రాప్, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు భగీరథ్ పంపిన లేఖను పరిశీలిస్తూనే, చట్టపరమైన తదుపరి చర్యలకు, అవసరమైతే అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.