పాకిస్థాన్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం ప్రవేశించిన ఘటనపై ఆ సంస్థ స్పందించింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై అంతర్గత విచారణ కొనసాగుతోందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.
జూన్ 22న ఏఐ479 విమానం న్యూఢిల్లీ నుంచి అమృత్ సర్ కు బయలుదేరింది. ఈ విమానం అమృత్ సర్ లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే, అదే సమయంలో ఎయిర్‌పోర్టులో అనుకోని పరిస్థితులు ఏర్పడటంతో విమానానికి వెంటనే ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో పైలట్లు భద్రతా నిబంధనల ప్రకారం ‘గో అరౌండ్’ ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో విమానం కొద్ది సేపు పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లినట్లు వెల్లడైంది.
ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా స్పందించింది. అమృత్ సర్ ఎయిర్‌పోర్టులో మరో విమానాన్ని పక్షి ఢీకొనడంతో రన్‌వేపై తనిఖీలు నిర్వహించాల్సి వచ్చిందని తెలిపింది. అందుకే, ఎయిర్ ఇండియా విమానానికి వెంటనే ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సమన్వయం చేసిన తర్వాతే ఆ విమానం వారి గగనతలంలోకి ప్రవేశించిందని, అనంతరం దానిని తిరిగి న్యూఢిల్లీకి మళ్లించినట్లు వెల్లడించింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఆపరేటింగ్ సిబ్బంది సకాలంలో తెలియజేయలేదని డీజీసీఏ పేర్కొంది. దీంతో వారిపై తాత్కాలిక చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా, 2025లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాలు ఒకదానికొకటి గగనతల వినియోగంపై పరిమితులు విధించాయి. ఈ నేపథ్యంలో భారత విమానం పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.