క్రైమ్ మిర్రర్, సినిమా:- ఇటీవల లెనిన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందంటూ మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కలెక్షన్లను ఎక్కువగా చూపిస్తున్నారంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో మరోసారి కలెక్షన్ పోస్టర్లపై చర్చకు తెరలేపాయి.ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ సినిమా కలెక్షన్ల పోస్టర్ల గురించి మాట్లాడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోస్టర్లపై చూపించే కలెక్షన్ నంబర్లు పూర్తిగా వాస్తవ లెక్కలతో ఉండవని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సినిమా ఎంత వసూలు చేసిందనే విషయాన్ని ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన ఆయన.. ప్రధానంగా అభిమానులను సంతోషపెట్టేందుకే ఇలాంటి పోస్టర్లు విడుదల చేస్తామని తెలిపారు.
యశస్వి జైస్వాల్‌తో డేటింగ్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్
రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాకు రూ.110 కోట్లు అని చెప్పే అవకాశం ఉంటుందని, అయితే రూ.100 కోట్లు వచ్చినప్పుడు రూ.200 కోట్లు అని మాత్రం చెప్పమని నాగవంశీ పేర్కొన్నారు. వాస్తవ వసూళ్ల కంటే కొంత ఎక్కువగా చూపించడం వల్ల అభిమానులు సంతోషిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా సినిమాల విజయాన్ని కొలిచే విషయంలో కలెక్షన్ పోస్టర్లు ఎంతవరకు వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయనే చర్చ మొదలైంది. సినిమా విడుదలైన తర్వాత తొలి రోజు వసూళ్లు, వారాంతపు కలెక్షన్లు, 10 రోజుల గ్రాస్ అంటూ వరుసగా పోస్టర్లు విడుదల చేయడం సాధారణంగా మారిపోయింది.
మరోవైపు కలెక్షన్లకు సంబంధించిన అసలు లెక్కలు ప్రభుత్వ శాఖల వద్ద ఉంటాయని నాగవంశీ తెలిపారు. GST, TDS, బ్యాంకింగ్ లావాదేవీల వంటి వివరాల ద్వారా సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉంటుందని చెప్పారు. పోస్టర్లలో కనిపించే కలెక్షన్ నంబర్ల కంటే అసలు లెక్కలు సంబంధిత శాఖల వద్ద ఉంటాయని పేర్కొన్నారు.ఇదే సమయంలో ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులపైనా నాగవంశీ స్పందించారు. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్, హిందీ మార్కెట్ వంటి ఆదాయ మార్గాలు గతంతో పోలిస్తే తగ్గాయని చెప్పారు. మరోవైపు సినిమాల నిర్మాణ వ్యయం మాత్రం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.మొత్తంగా లెనిన్ 100 కోట్ల పోస్టర్‌పై మొదలైన చర్చకు నాగవంశీ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని జోడించాయి. సినిమా కలెక్షన్ల పోస్టర్లలో కనిపించే నంబర్లకు, అసలు వసూళ్లకు మధ్య ఎంత తేడా ఉంటుందనే అంశం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
