-
కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో జాడ లేని ఇన్చార్జులు
-
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ అంతా ఏకపక్షమే
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోంది. తాడేపల్లిలో పార్టీ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు ఇచ్చారు అధినేత జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే.. ఇన్చార్జిలపై వేటు తప్పదు అని హెచ్చరించినంత పని చేశారు. అయితే దీనిపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి.
వీలైనంత ఎక్కువగా అధికార పార్టీకి ఏకగ్రీవాలు జరుగుతాయి. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఏకగ్రీవాలు ఎక్కువగా అయ్యాయి. ఈ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడడం ఏమిటనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆవేదన. మొన్ననే పులివెందుల జడ్పిటిసి ఎన్నికలు జరిగాయి. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఆ ఎన్నికల్లో. దానిని ఎక్కువమంది ఉదహరిస్తున్నారు.
కుప్పంలో జాడ లేని భరత్..
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఇన్చార్జిలు యాక్టివ్ కాలేదు. కొత్త వారి నియామకం జరగలేదు. అటువంటి వాటిలో కుప్పం నియోజకవర్గంలో ఒకటి. అక్కడ వైసీపీ ఇన్చార్జిగా భరత్ అనే నేత ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వై నాట్ కుప్పం అని నినాదం చేసింది ఆ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుంది.
ప్రలోభాలపర్వంతో ఏకపక్షంగా స్థానిక సంస్థలను గెలుచుకుంది. అప్పటినుంచి వై నాట్ కుప్పం అన్న స్లోగన్ వినిపించింది. కానీ మొన్నటి ఎన్నికల్లో అక్కడ దారుణంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం అక్కడ వైసీపీకి దిక్కులేదు. ఇంచార్జ్ గా ఉన్న భరత్ జాడలేదు. మరి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఎలా ఎదుర్కోవాలి? ఆ పార్టీ శ్రేణులనుంచి వినిపిస్తున్న మాట అది.
మంగళగిరిలో చాప చుట్టేశారు
లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలోను అదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయారు. అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక అక్కడ తమకు తిరుగు లేదని చెప్పి విర్రవీగారు. కానీ ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది.
90000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు నారా లోకేష్. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జాడలేదు. లోకేష్ పై పోటీ చేసిన మహిళా నేత కనిపించడం లేదు. అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిక్కే లేదు. అటువంటి చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి ఎలా గెలుస్తుంది. అసలు నిలబడగలదా? అనేది ప్రశ్న.
పిఠాపురంలో ఫుల్ సైలెన్స్..
పిఠాపురంలో సైతం అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు ముద్రగడ పద్మనాభం. లేకుంటే తన పేరు మార్చుకుంటానని కూడా సవాల్ చేశారు. అఖండ మెజారిటీతో గెలిచారు పవన్. ముద్రగడ ఏకంగా తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. పవన్ పై పోటీ చేసిన వంగా గీత జాడలేదు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు జనసేనలో చేరిపోయారు. అసలు ఆ నియోజకవర్గంలో వైసిపి క్యాడర్ను పట్టించుకునే నాధుడు లేరు. ఇలాంటి నియోజకవర్గాలను వదిలేసి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఉండకూడదు అని జగన్ చేస్తున్న ప్రకటనను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు.