Homeఆంధ్ర ప్రదేశ్అడ్డంగా బుక్కైన మాజీ మంత్రి సీదిరి!

అడ్డంగా బుక్కైన మాజీ మంత్రి సీదిరి!

•పోలీసుల ఎదుట లొంగిపోయిన కుమారుడు
•ఓ ప్రమాదంలో గొర్రెల కాపరి మరణానికి కారణం
•కేసు తారుమారు చేసే ప్రయత్నం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో
:-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలకు కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు పై కేసు నమోదయింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణానికి కారణమైనందున ఆయన కుమారుడు పై కేసు నమోదయింది. కోర్టు రిమాండ్ కూడా విధించింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణానికి కారణం కావడమే కాకుండా.. కేసును తారుమారు చేసే ప్రయత్నంలో అడ్డంగా బుక్కయ్యారు అప్పలరాజు. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం ఆయనపై ఆగ్రహంగా ఉంది. మృతుడు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అందుకు కారణం.

ఐదు రోజుల కిందట ఘటన..
ఈనెల 10న కాశీబుగ్గ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. అతివేగంతో వస్తున్న బైక్ ఢీ కొట్టి ఆయన మృతి చెందారు. అయితే నాటకీయ పరిణామాల నడుమ ఆ ప్రమాదానికి కారణం మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ అని తేలింది. పోలీసులు కేసును తారుమారు చేసే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. మాజీమంత్రి కుమారుడు ఆరవ్ బదులుగా అతని స్నేహితుడు, అప్పలరాజు ప్రధాన అనుచరుడి కుమారుడైన సిద్ధార్థత్యాన్ని నిందితుడిగా చేర్చారు. అతని వెంటనే అదుపులోకి తీసుకుని.. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. రెండు రోజులుగా ఈ వ్యవహారాన్ని కప్పి పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఇది రచ్చకు ఎక్కడం, పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. ప్రమాదానికి కారణం మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ అని తేల్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

సంచలనంగా..
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం సీసీ పూటేజీ వలనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 9:07 గంటలకు ఆరవ్ ఒక్కడే పెట్రోల్ బంక్ కు వెళ్లి.. బైక్ లో పెట్రోల్ పోయించుకున్నట్లు సిసి ఫుటేజీ దృశ్యాలు చెబుతున్నాయి. తరువాత కొద్దిసేపటికి పెట్రోల్ బంకు సమీపంలో.. కేవలం 500 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోక ముందే ఆరవ్ ను అక్కడి నుంచి ఓ కారులో తరలించినట్లు గుర్తించారు. ఆయా దృశ్యాలు సిసిటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆరవ్ ను నిందితుడిగా చేర్చాల్సిన పోలీసులు.. ఈ కేసు నుంచి తప్పించడం సంచలనంగా మారింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

యాదవ సామాజిక వర్గం ఆందోళన..
మరోవైపు యాదవ సామాజిక వర్గం మాజీ మంత్రి అప్పలరాజు తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. పలాస నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం అధికం. మృతుడు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆ సామాజిక వర్గ ప్రజలు పెద్ద ఎత్తున మంగళవారం సాయంత్రం పలాస కాశీబుగ్గ జంట పట్టణాలకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బాధిత కుటుంబానికి 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసును తారుమారు చేయాలనుకున్న మాజీ మంత్రి అప్పలరాజును తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు