భారతీయుల దినచర్యలో టీ ఒక భాగం. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి టీ పడకపోతే చాలా మందికి రోజు మొదలవ్వదు. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసటగా అనిపించినప్పుడు, స్నేహితులతో కబుర్లు చెబుతున్నప్పుడు.. ఇలా ప్రతి సందర్భానికీ టీ తోడుండాల్సిందే. అయితే, చాలా ఇళ్లలో, ఆఫీసుల్లో ఒకేసారి ఎక్కువ టీ చేసి ఉంచుకుని, మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగే అలవాటు ఉంటుంది. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.టీని పదే పదే వేడి చేయడం వల్ల అందులోని సహజ గుణాలు నశించడమే కాకుండా, శరీరానికి హాని చేసే పలు రసాయన మార్పులు జరుగుతాయని వైద్యులు వివరిస్తున్నారు.
ప్రధానంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇవే:
1. పెరిగే యాసిడ్ గుణాలు – జీర్ణ సమస్యలు:- టీ ఆకుల్లో సహజంగానే కొంత ఆమ్లత్వం ఉంటుంది. టీని పదే పదే మరిగించడం వల్ల ఈ యాసిడ్ గుణాలు మరింత పెరుగుతాయి. ఇలాంటి టీని తాగినప్పుడు కడుపులో మంట, విపరీతమైన ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది అల్సర్లకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది.
2. బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలం:- సాధారణంగా మనం టీలో పాలు, చక్కెర కలుపుతాము. ఈ రెండూ బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. టీ చేసి గంటలు గడిచేకొద్దీ అందులో బ్యాక్టీరియా చేరుతుంది. 3 లేదా 4 గంటల తర్వాత ఆ టీని మళ్లీ వేడి చేసి తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి రావచ్చు.
3. ఐరన్ లోపానికి దారితీసే ‘టానిన్లు’:- టీలో ‘టానిన్లు’ అనే సమ్మేళనాలు ఉంటాయి. టీని ఎక్కువగా మరిగించినప్పుడు ఈ టానిన్లు అధిక మొత్తంలో విడుదలవుతాయి. ఈ టానిన్లు మనం తీసుకునే ఆహారం నుండి శరీరం ఇనుము ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది, తద్వారా నీరసం, అలసట వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు పదే పదే వేడి చేసిన టీకి దూరంగా ఉండటం చాలా అవసరం.
వైద్యుల సూచనలు:- ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాజాగా టీ చేసుకుని తాగడం ఉత్తమం. ఒకసారి చేసిన టీ మిగిలిపోతే, దానిని మళ్లీ వేడి చేసి తాగే బదులు పారబోయడమే మంచిది. ఆరోగ్యం కంటే టీ ముఖ్యం కాదు కదా. ఒకేసారి ఎక్కువ టీ చేయాల్సి వస్తే, వేడి చేసిన వెంటనే దానిని మంచి థర్మోస్ ఫ్లాస్క్ లో భద్రపరచుకోండి. ఇలా చేయడం వల్ల టీ వేడిగా ఉంటుంది మరియు పదే పదే మరిగించాల్సిన అవసరం ఉండదు.కాబట్టి, టీ ప్రియులారా.. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పదే పదే వేడి చేసిన టీని తాగే అలవాటును ఈ రోజు నుండే మానుకోండి. తాజా టీతో రిఫ్రెష్ అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి!
