Homeక్రైమ్ప్రసూతి సెలవులు తీసుకున్నారని హోదా తగ్గించొద్దు.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

ప్రసూతి సెలవులు తీసుకున్నారని హోదా తగ్గించొద్దు.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

క్రైమ్ మిర్రర్ : ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులపై వివక్ష చూపడం సరికాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మాతృత్వ సెలవుల కారణంగా ఉద్యోగి హోదాను తగ్గించడం, బాధ్యతలను మార్చడం లేదా కెరీర్‌లో వెనుకబడేలా చేయడం వివక్ష కిందకే వస్తుందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ రాఖీ బిష్ట్ 2022లో ఓ సంస్థలో మేనేజర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమెకు నెలకు రూ.2.6 లక్షల వేతనం ఉన్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది.

2023 మేలో తన గర్భధారణ విషయాన్ని సంస్థ యాజమాన్యానికి తెలియజేసిన తర్వాత ఆమెను మరో బృందానికి బదిలీ చేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో ప్రసూతి సెలవులకు వెళ్లిన రాఖీ బిష్ట్.. 2024 జూలైలో తిరిగి విధుల్లో చేరారు. అయితే ఆమె గతంలో నిర్వహించిన పోస్టు ప్రస్తుతం అందుబాటులో లేదని సంస్థ తెలిపి, మరో విభాగంలో కొత్త బాధ్యతలు అప్పగించింది. తన విద్యార్హతలు, అనుభవానికి సంబంధం లేని పనిని కేటాయించారని, ప్రసూతి సెలవులు తీసుకున్నందుకు తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడిందని రాఖీ బిష్ట్ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ సందర్భంగా సంస్థ తరఫు న్యాయవాదులు.. ఉద్యోగి హోదా, వేతనం, సీనియారిటీలో ఎలాంటి మార్పు చేయలేదని వాదించారు. అయితే ఈ వాదనను కోర్టు అంగీకరించలేదు. జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం మాట్లాడుతూ.. మహిళలకు మాతృత్వ హక్కులు కల్పించడం అంటే కేవలం సెలవులు మంజూరు చేయడం, జీతం తగ్గించకపోవడం మాత్రమే కాదని పేర్కొంది. ప్రసూతి సెలవుల కారణంగా మహిళా ఉద్యోగిని వృత్తిపరంగా లేదా మానసికంగా వెనక్కి నెట్టే విధంగా ఆమె హోదా, బాధ్యతలను తగ్గించడం కూడా వివక్షగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రసూతి సెలవుల అనంతరం పాత పోస్టులో తిరిగి నియమించడం సాధ్యం కాని పరిస్థితి ఉంటే.. అదే స్థాయి బాధ్యతలు, అధికారాలు, కెరీర్ పురోగతికి సమానమైన అవకాశాలు కలిగిన మరో పదవిని ఇవ్వాలని కోర్టు సూచించింది. మాతృత్వ సెలవులను కారణంగా చూపి మహిళా ఉద్యోగి హోదా లేదా విధుల్లో ప్రతికూల మార్పులు చేయడం వివక్షకు దారితీస్తుందని ధర్మాసనం పేర్కొంది. మహిళా ఉద్యోగుల మాతృత్వ హక్కులను పరిరక్షించేందుకు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద తగిన నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
also read : ఇన్‌స్టా, యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్ట్!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు