క్రైమ్ మిర్రర్ : కేరళ–కర్ణాటక అంతర్రాష్ట్ర సరిహద్దులో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ వాహనం డ్రైవర్ సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో దాచిన రూ.1.44 కోట్ల నగదు బయటపడింది. ఈ వ్యవహారంలో వాహనంలో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వయనాడ్ జిల్లా తోల్పట్టి వద్ద తిరునెల్లి పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక ప్రత్యేక బృందం కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కర్ణాటక వైపు నుంచి వస్తున్న ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
డ్రైవర్ సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరను గుర్తించిన పోలీసులు దానిని పరిశీలించగా నగదు కట్టలు కనిపించాయి. వాటిని లెక్కించగా మొత్తం రూ.1,44,50,000 ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు వాహనంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం.. కోజికోడ్ జిల్లా వడకరకు చెందిన ప్రభు రాజ్ (20), కన్నూర్ జిల్లా పనూరుకు చెందిన స్వప్నిల్ (23), మహారాష్ట్రకు చెందిన రాహుల్ (26) ఈ ముగ్గురూ వాహనంలో ఉన్నారు.
ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎందుకు తరలిస్తున్నారు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నగదుకు సంబంధించిన పత్రాలు, లావాదేవీల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో నిర్వహించిన తనిఖీల్లో రూ.1.44 కోట్ల నగదు బయటపడటంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత నగదుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : కొండపోచమ్మ రిజర్వాయర్‌లో మునిగి 18 ఏళ్ల విద్యార్థి మృతి
