క్రైమ్ మిర్రర్ : నిర్మల్ జిల్లా బాసర పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల రమావత్ సాయికిరణ్ గోదావరి నదిలో పడి మృతి చెందాడు. సాయికిరణ్ యూకేలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆయన సెప్టెంబర్ 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం బాసర ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చాడు.
ఆలయంలో దర్శనం పూర్తిచేసుకున్న అనంతరం బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సాయికిరణ్ గోదావరి నదిలో పడిపోయాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం గాలింపు కొనసాగిస్తుండగా సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి రమావత్ భోజారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
also read : వాహనం సీటు కింద రహస్య అర.. రూ.1.44 కోట్ల నగదు స్వాధీనం
