-కొండా సురేఖకు మద్దతుగా బలమైన లాబీయింగ్
-రంగంలోకి ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు.. ఒక సీనియర్ నేత సైతం
-చర్యల విషయంలో వెనక్కి తగ్గాలని అధిష్టానం పై ఒత్తిడి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణ మంత్రి కొండా సురేఖను ఢిల్లీ స్థాయిలో కాపాడుతోంది ఎవరు? ఆమె వైపు బలమైన లాబీయింగ్ పనిచేస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆమె విషయంలో కాంగ్రెస్ కీలక నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఓ ఇద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, తెలంగాణలోని ఇద్దరు సీనియర్ మంత్రులు, మరో సీనియర్ నేత రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆమెపై చర్యలు తీసుకునే విషయంలో అధిష్టానానికి కీలక సూచనలు చేసినట్లు సమాచారం. వీలైనంతవరకు ఆమె విషయంలో పునర్ ఆలోచన చేయాలని కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
అందరూ ఢిల్లీలోనే..
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇద్దరు సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి సైతం ఢిల్లీలోనే ఉన్నారు. అయితే సీఎంతో పాటు మంత్రులతో కాంగ్రెస్ అగ్ర నేతలు వేరువేరుగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కొండా సురేఖ విషయంలో.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. అయితే కొండా సురేఖ విషయంలో చర్యలు తీసుకోవాల్సిందేనని టిపిసిసి క్రమశిక్షణ కమిటీ నివేదికలు ఇచ్చింది. మరోవైపు సురేఖ వైఖరి పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు ఉపేక్షిస్తే మరికొంతమంది అదే బాటలో నడుస్తారని.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే నన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో వస్తోంది.
హై కమాండ్ దే తుది నిర్ణయం..
మరోవైపు కొండా సురేఖ సైతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె సైతం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను కలుస్తున్నారు. అయితే ఓ ఇద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇద్దరు ఆమె తరుపున అధిష్టానంతో సానుకూల చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏకపక్షంగా ఆమెపై చర్యలు వద్దని.. మంత్రి పదవి నుంచి తొలగిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. అందుకే శాఖలను మార్చి ఈ ఎపిసోడ్ ను ఇంతటితో ముగించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కుటుంబ వ్యవహారమని.. సురేఖ క్షమాపణ కూడా చెప్పారని గుర్తు చేస్తున్నారు. అయితే అధిష్టానానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. క్రమశిక్షణ కట్టు దాటిన నేతలపై చర్యలు తీసుకోకపోతే అది అంతిమంగా పార్టీకి నష్టం అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. అందుకే ఇప్పుడు కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.
