రామకృష్ణాపూర్, (క్రైమ్ మిర్రర్ ) : కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థలు, మానసిక మనస్థాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.స్థానిక ఎస్ఐ జె.శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం… భగత్ సింగ్ నగర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి పిన్నింటి బుచ్చి రాజయ్య కుమారుడు పిన్నింటి మహేందర్ (39) మద్యానికి బానిసయ్యాడు. తనకు వివాహ సంబంధాలు కుదరకపోవడానికి స్వంత ఇల్లు లేకపోవడమే కారణమని భావించేవాడు. ఇటీవల అతడి తండ్రి గద్దె రాగడి ప్రాంతంలో ఒక ఇల్లు కొనుగోలు చేయగా, దానిని తన పేరిట రాయాలని మహేందర్ తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు.మంగళవారం రాత్రి కూడా ఈ విషయమై ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిన మహేందర్, బయట మంచంపై కూర్చొని తండ్రితో వాగ్వాదానికి దిగాడు.
Also Read:పుట్టినరోజు వేడుకల్లో ‘స్వింగ్ కింగ్’ మహమ్మద్ షమీ: రీఎంట్రీ కోసం దేశవాళీలో అలుపెరుగని పోరాటం!
అనంతరం రాత్రి 10:45 గంటల ప్రాంతంలో సింగరేణి విధులకు వెళ్లేందుకు తండ్రి బుచ్చి రాజయ్య లేచి చూడగా, ముందు తలుపులు రాకపోవడంతో కిటికీలోంచి పరిశీలించాడు. అక్కడ మహేందర్ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే వెనుక తలుపుల గుండా బయటకు వచ్చి చూడగా అప్పటికే అతడు మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి బుచ్చి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు
