భారతదేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ, ప్రకృతి సిద్ధంగా హృదయాకారంలో ఏర్పడిన అరుదైన సరస్సు మాత్రం కేరళలోనే ఉంది. ప్రేమకు ప్రతీకలా కనిపించే ఈ ప్రత్యేక సరస్సును చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పచ్చని కొండలు, దట్టమైన మేఘాలు, స్వచ్ఛమైన గాలి మధ్య హృదయాకారంలో మెరిసే ఈ సరస్సు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ సరస్సును “హృదయాకార సరస్సు” లేదా “ప్రేమ సరస్సు” అని పిలుస్తారు.
ఈ అద్భుతమైన సరస్సు చెంబ్రా పీక్‌పై భాగంలో ఉంది. వయనాడ్ జిల్లాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా చెంబ్రా పీక్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 6,900 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకునే మార్గంలో సగం దూరం వెళ్లిన తర్వాత ఈ హృదయాకార సరస్సు కనిపిస్తుంది. దట్టమైన పొగమంచు మధ్య ఆకుపచ్చని కొండల నడుమ మెరిసే ఈ సరస్సు దృశ్యం పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది.
ఈ సరస్సుకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. ఎంతటి ఎండాకాలమైనా ఇందులోని నీరు ఎప్పటికీ ఎండిపోదని స్థానికులు చెబుతుంటారు. తీవ్రమైన వేసవిలో కూడా ఈ సరస్సు నీటితో నిండి ఉండటం పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందుకే కొత్తగా పెళ్లైన జంటలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తుంటారు.
చెంబ్రా పీక్ ప్రకృతి సౌందర్యంతో పాటు సాహస యాత్రలను ఇష్టపడేవారికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. తేయాకు తోటలు, దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల గుండా సాగిపోయే ప్రయాణం సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈ సరస్సు వరకు వెళ్లాలంటే అటవీ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి రోజూ పరిమిత సంఖ్యలో మాత్రమే పర్యాటకులను అనుమతిస్తున్నారు.
ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు ముందుగా వయనాడ్ జిల్లాకు చేరుకోవాలి. అక్కడి ప్రధాన పట్టణమైన కల్పెట్టా నుంచి చెంబ్రా పీక్ ప్రారంభ కేంద్రం దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి అటవీ శాఖ అనుమతితో ప్రయాణం ప్రారంభించవచ్చు. యాంత్రిక జీవితానికి దూరంగా ప్రకృతి మధ్య ప్రశాంతతను ఆస్వాదించాలని కోరుకునే వారికి ఈ హృదయాకార సరస్సు అద్భుతమైన పర్యాటక గమ్యస్థానంగా నిలుస్తోంది.
ALSO READ: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. రాఘవేంద్ర హోటల్ నిర్లక్ష్యానికి పరాకాష్ట!