తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజులు కిందట జరిగిన ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అత్యధిక స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవరసమైన స్థానాలు రాకపోవడంతో కొద్దిరోజులపాటు ఊగిసలాట జరిగింది. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, మరికొందరు మద్ధతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్దిరోజులకే అన్నాడీఎంకే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్ధతు ఇస్తామంటూ ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకేలో తిరుగుబాటు మొదలైనట్టైంది. అన్నాడీఎంకేలో గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు పళనిస్వామి వెంట ఉండగా, మరికొందరు వేలుమణి వెంట నిలిచారు. వీరంతా సీఎం విజయ్‌ను కలిసి మద్ధతు కూడా తెలియజేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టైంది. విజయ్‌ను అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మద్ధతు ప్రకటించడం పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. విజయ్ కూడా ఈ తరహా రాజకీయాలకు పాల్పడడం ఊహించలేమంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
-
ట్విస్ట్ ఇచ్చిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు..
వేలుమణి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం విజయ్ పార్టీలతో చేరిపోతారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజా వ్యవహారంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. వేలుమణి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పళనిస్వామితో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం అన్నాడీఎంకేలో చీలిక లేదంటూ తాజాగా ప్రకటించడంతో తమిళ రాజకీయాల్లో ట్విస్ట్ నెలకొన్నట్టైంది. పళనిస్వామితో సమావేశం అనంతరం స్పీకర్‌ను కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు తామంతా ఒకటిగా ఉంటున్నామంటూ స్పష్టం చేశారు. కలిసికట్టుగానే ఉంటామని చెప్పడం ద్వారా పళనిస్వామికి విధేయతను ప్రకటించారు.
-
ఇదీ జరిగింది..
ఎన్నికల్లో ఓటమి అనంతరం పళనిస్వామికి వ్యతిరేకంగా సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం ఎమ్మెల్యులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ వర్గం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వాలని కోరారు. పళనిస్వామి ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో తిరుగుబాటు వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పళినస్వామి మాటను పక్కనబెట్టి విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పళనిస్వామి తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాశారు. స్పీకర్ కార్యాలయంలో అనర్హత వేటు ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరిపోయారు. ఈ క్రమంలోనే ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని ఆయన నివాసంలో కలిసి సంధి ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం పళనిస్వామి తమ నాయకుడని వారు స్పష్టం చేశారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల వల్ల తిరుగుబాటు జరిగిందని, తమ డిమాండ్లను పరిష్కరించడానికి పళనిస్వామి అంగీకరించారని నేతలు వెల్లడించడంతో అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం తాత్కాలికంగా ముగిసినట్టైంది. భవిష్యత్‌లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాల్సి ఉంది.