అమరావతి, క్రైమ్‌మిర్రర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకరకంగా వైసిపి ఈ వ్యవహారంతో తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంది. అప్పటి టీటీడీ చైర్మన్ తో పాటు చాలామంది ప్రముఖులు ఇందులో భాగస్వాములయ్యారంటూ కూటమి నాయకులు విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై పరిధి దాటి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాయి.
విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. ఇప్పటికే వివిధ సంస్థలు ఈ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో విచారణ ప్రక్రియను చేపట్టాయి. తాజాగా తిరుమల లడ్డు వ్యవహారంలో కీలకమైన చర్యలను తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రీ వైష్ణవి డైరీ తో కుమ్మక్కైన ఏడుగురు కార్మిక శాఖ అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. సిట్ నివేదిక, ఆధారాలను అనుసరించి కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖ నిబంధనలు, ఏపీ పౌర సేవల ప్రవర్తన నియమావళి 1964, ఏపీ సిఎస్ రూల్స్ 1991ను అనుసరించి అభియోగాలు నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అధికారులు తమపై వచ్చిన ఆరోపణలపై పది రోజుల్లోగా లికిత పూర్వక సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శేషాద్రి బాబు కోరారు
శ్రీ వైష్ణవి డైరీ కి సహకారం అందించినట్లు నిర్ధారణ…
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన శ్రీ వైష్ణవి డైరీ కి టిటిడి అధికారులతో పాటు ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులు సహకరించినట్లు నిర్ధారణ అయింది. తనిఖీలు సమయంలో లోపాలను గుర్తించకుండా ఈ అధికారులు డైరీకి సహకారాన్ని అందించారు. అదే సమయంలో డైరీ లైసెన్స్ రెన్యువల్ సమయంలోను తనిఖీలు చేయకుండా కొనసాగింపు ఇచ్చే విషయంలో పూర్తిగా సహకారాన్ని అందించినట్లు విచారణలో వెళ్లడైంది. ఇందుకోసం డైరీ నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో డైరీ కి సహకరించిన ఫ్యాక్టరీస్ కార్మిక శాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.
డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గా పనిచేసి రిటైర్ అయిన కర్రి పరమేశ్వరరావు, విజయవాడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎం సత్యనారాయణ, ప్రస్తుతం ఏలూరులో బాయిలర్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్న ఎంవీఎల్ నరసింహారాజు, నెల్లూరులో బాయిలర్ ఇన్స్పెక్టర్ గా ఉన్న టి సుష్మ, తిరుపతిలో బాయిలర్ ఇన్స్పెక్టర్ గా ఉన్న పి రాంబాబు, చిత్తూరు, నెల్లూరులో బాయిలర్ ఇన్స్పెక్టర్ గా ఉన్న ఎన్ శివశంకర్ రెడ్డి, నెల్లూరులో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంలో సూపర్వైజర్ గా పనిచేసి రిటైర్ అయిన బి రమేష్ బాబు పై ప్రభుత్వం అభియోగాలను నమోదు చేసింది. ఈ అభియోగాలకు సంబంధించి పది రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఉద్యోగులపై ఉమ్మడి విచారణ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కల్తీ లడ్డు వ్యవహారంలో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన అధికారుల చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని తెలుస్తోంది.