ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరతపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీజిల్ కోసం రైతులు పెట్రోల్ కోసం సాధారణ ప్రజలు గంటల కొద్ది క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర స్థితిలో ప్రజా అవసరాలపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. బడా కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పాకులాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సామాన్యుల కష్టాలను గాలికొదిలేసి కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా డీజిల్ సరఫరా చేయాలని కోరడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రస్తుత పాలనలో రైతు కన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా అని షర్మిల ప్రశ్నించారు. పొలాలకు నీరు పెట్టేందుకు డీజిల్ లేక రైతన్నలు అల్లాడుతుంటే వారిని పట్టించుకోని ఈ ప్రభుత్వం.. కేవలం అమరావతి పనుల కోసమే ప్రాధాన్యత ఇవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇది పక్కాగా ప్రాధాన్యతల వైఫల్యమని ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాల కంటే బడా కాంట్రాక్టర్ల లాభాలే ప్రభుత్వానికి ముఖ్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉందని విమర్శించారు. ఇంధనం కోసం బంకుల వద్ద జనం పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా సాగేలా చూడటమే ప్రభుత్వ మొదటి బాధ్యత అని షర్మిల స్పష్టం చేశారు. ముందుగా వ్యవసాయ పనులు సాఫీగా సాగేందుకు రైతులకు అవసరమైన డీజిల్ అందజేయాలని డిమాండ్ చేశారు. ఆ తరువాతే కాంట్రాక్టర్లకు అందించే ప్రత్యేక సదుపాయాలపై మాట్లాడాలని సూచించారు. ప్రజలు ఎలా పోతే మాకేంటి మాకు కాంట్రాక్టర్లే ముఖ్యం అనుకుంటే ప్రజల కష్టాలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి సామాన్యులే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలను వెంటనే పెంచి బ్లాక్ మార్కెట్ నివారించాలని కోరారు.
అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆమె గుర్తు చేశారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఇంధన సంక్షోభం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైన మంత్రులు తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులు సామాన్యుల పక్షానే నిలబడుతుందని ఈ సందర్భంగా షర్మిల పునరుద్ఘాటించారు. ప్రజల ఇబ్బందులు తొలగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ALSO READ: కోతకు వచ్చిన ఆశల పంట అగ్నికి ఆహుతి… సీఎం ఆదేశాలతో సహాయక చర్యలు