క్రైమ్ మిర్రర్ : అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్‌లో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు విద్యార్థినులపై తోటి విద్యార్థిని బ్లేడ్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధిత విద్యార్థినులకు స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం ప్రకారం.. హాస్టల్‌లో నిద్రిస్తున్న ఇద్దరు విద్యార్థినులపై ఓ తోటి విద్యార్థిని బ్లేడ్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గొంతు కోసేందుకు ప్రయత్నించిన సమయంలో బ్లేడ్ పదును లేకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని సమాచారం. దీంతో బాధిత విద్యార్థినులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో హాస్టల్‌లోని ఇతర విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో హాస్టల్ వాతావరణం ఆందోళనకరంగా మారింది. ఇదిలా ఉండగా, ఘటన జరిగిన వెంటనే హాస్టల్ యాజమాన్యం లేదా వార్డెన్ బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విద్యార్థినుల మధ్య ఈ ఘటనకు దారితీసిన కారణాలు, హాస్టల్ నిర్వహణలో జరిగిన లోపాలపై విచారణ జరిపే అవకాశం ఉంది.
also read : మంచుకొండల్లో విషాదం.. హిమపాతంలో దిగ్గజ పర్వతారోహకుడు నిమ్స్‌దాయ్ మృతి
