క్రైమ్ మిర్రర్ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు అనుమానితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు సెప్టెంబరు 9, 10 తేదీల్లో తనకు గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇచ్చిన అనంతరం లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
అరెస్టైన నిందితులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల నివేదికల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పరీక్షల్లో ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగించినట్లు నిర్ధారణ అయితే, వారిపై ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్లను కూడా నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.అదే సమయంలో నిందితులు గంజాయిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు, ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, దాని సరఫరా, విక్రయాలకు సంబంధించిన నెట్వర్క్ ఏమైనా ఉందా అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలికి గత రెండేళ్లుగా పరిచయం ఉన్న కొందరు యువకులు మత్తు పదార్థాలకు అలవాటు చేశారన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించారు. డ్రగ్స్ పరీక్షల నివేదికలు ఒకటి రెండు రోజుల్లో అందే అవకాశం ఉందని, వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేకంగా గాలింపు కొనసాగుతోంది.
also read :డబ్బుల వివాదం.. తండ్రిపై కత్తితో దాడి చేసి హత్య
