క్రైమ్ మిర్రర్ : బైక్‌పై వెళ్తున్న ఓ మహిళా రైడర్‌ను కారుతో వెంబడించి ఢీకొట్టిన ఘటనలో నిందితుడిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో కారు డ్రైవర్ కళ్యాణ్ బైన్సాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా అనే మహిళ ఏప్రిల్లా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా, తెలుపు రంగు సెడాన్ కారులో వచ్చిన కళ్యాణ్ ఆమెను వెంబడించినట్లు పోలీసులు తెలిపారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారుతో బైక్‌ను ఢీకొట్టడంతో సియా రోడ్డుపై పడిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడియోలను పరిశీలించిన అనంతరం నిందితుడి కదలికలను గుర్తించి రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై గురుగ్రామ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెక్టార్-56 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడికి నేరం రుజువైతే కఠిన శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
తనను కారు డ్రైవర్ వెంబడించడంతో పాటు చేతులతో బెదిరింపు సంకేతాలు చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనంతరం తన బైక్‌ను కారుతో ఢీకొట్టి నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఆమె పేర్కొంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా కూడా ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలి ఇంటికి వెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు, నిందితుడు-బాధితురాలి మధ్య ఏదైనా పూర్వ పరిచయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read: భర్త, కుమార్తె కళ్ల ముందే విషాదం.. డీసీఎం ఢీకొని మహిళ మృతి
