-
స్టడీ టూర్ కు మీనాక్షి నటరాజన్
-
పది నెలలపాటు విదేశాల్లోనే..
-
ముకుల్ వాస్నిక్ వైపు అధిష్టానం మొగ్గు
-
రేసులో మాణిక్ రావు ఠాక్రే సైతం..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి ఖాళీ అయింది. పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్ళనున్నారు. స్టడీ టూర్ నిమిత్తం లండన్ వెళ్తున్నారు. రాబోయే పది నెలలపాటు ఆమె అందుబాటులో ఉండరు.
అందుకే ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మార్పు అనివార్యంగా మారింది. ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఏఐసీసీకి అత్యవసరంగా మారింది. ఇప్పటికే పార్టీలో అంతర్గత విభేదాలు, పార్టీ- ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం నిత్యం కనిపిస్తూనే ఉంది. దానిని భర్తీ చేసే పవర్ఫుల్ నేత నియామకం జరపాల్సిన అవసరం ఉంది.
-
సీనియర్ నేత కావడంతో..
మీనాక్షి నటరాజన్ స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ దళిత నేత ముకుల్ వాస్నిక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సీనియర్ నేత. ఆపై వివాద రహితుడు అనే పేరు ఉంది. గ్రూపు రాజకీయాలకు అతీతంగా అందర్నీ కలుపుకొని పోయే ట్రబుల్ షూటర్ గా పేరు ఉంది.
తెలంగాణ లాంటి సంక్లిష్టమైన రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీలోని పాత కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మధ్య నడుస్తున్న సమన్వయ సమరాన్ని.. సమర్థవంతంగా నిర్వహించగలరని ఆలోచనతో హై కమాండ్ ముకుల్ వాస్నిక్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
-
పదవి కత్తి మీద సాము..
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ పదవి అంటే పార్టీలో ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఇన్చార్జి పదవి అంటే కత్తి మీద సాము. ప్రభుత్వ పాలన వేగవంతంగా సాగుతున్న సమయంలో.. పార్టీ క్యాడర్ ఆకాంక్షలను నెరవేర్చడం ఇన్చార్జ్ కు సవాల్ గా మారింది.
కుంతియా మొదలుకొని మాణిక్కం ఠాగూర్, మాణిక్ రావు ఠాక్రే, దీపా దాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ వరకు ఎవరు ఈ స్థానంలో ఎక్కువకాలం ప్రశాంతంగా పనిచేయలేకపోయారు. అధిష్టానం ఆదేశాలకు, స్థానిక సీనియర్ల అసంతృప్తికి మధ్య నిత్యం నలిగి పోవాల్సి రావడం ఈ పదవికి ఉన్న అతిపెద్ద శాపం.
-
ప్రతిసారి ప్రయోగమే..
తెలంగాణలో ఏ నేత కూడా స్వచ్ఛందంగా ఇన్చార్జి పదవి తీసుకునేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఏఐసీసీ ప్రతిసారి ప్రయోగం చేస్తోంది. నేతలపై ఒత్తిడి తెచ్చి ఇంచార్జ్ పదవిలో కూర్చోబెడుతోంది.
ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్ నేతకు అప్పగిస్తారా? లేకుంటే అనుభవం ఉన్న మాణిక్ రావు ఠాక్రేకు మళ్లీ నియమిస్తారా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. ఎవరు వచ్చినా గాంధీభవన్‌లోని గ్రూపు రాజకీయాల్లో జోరును తట్టుకొని.. పార్టీని సిద్ధం చేయడమే లక్ష్యంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
