-
వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కోసం అమర్నాథ్ ప్రయత్నం
-
సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా అధినేతకు రాయబారం
-
స్థానిక నాయకత్వం వైపే జగన్ మొగ్గు
-
మాజీ మంత్రికి షాక్
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. విజయనగరం వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవితో పాటు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు.
అయితే ఇప్పుడు భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ పోస్ట్ కోసం మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చోడవరం వైసీపీ ఇన్చార్జిగా ఉన్నారు. అయిష్టంగానే ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు భీమిలి ఖాళీ కావడంతో ఆ స్థానాన్ని కోరుకుంటున్నారు.
-
అవంతి పార్టీ మారడంతో..
మొన్నటి ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేశారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. కానీ టిడిపి అభ్యర్థి గంటా చేతిలో ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఇక్కడ తక్షణ దిద్దుబాటు చర్యలను నిమిత్తం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్.
వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి మరోసారి బరిలో దిగుతారని.. భీమిలి నుంచి మజ్జి శ్రీనివాసరావు రంగంలో ఉంటారని అంతా భావించారు. కానీ ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరిపోయారు.
దీంతో భీమిలి నియోజకవర్గం ఖాళీ అయింది. అక్కడకు వెళ్లేందుకు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
-
చివరి నిమిషంలో గాజువాకకు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి బరిలో దిగారు గుడివాడ అమర్నాథ్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచిన అమర్నాథ్ మంత్రి కూడా అయ్యారు. మరోసారి అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. చివరి నిమిషంలో గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు.
కానీ అక్కడ రికార్డు స్థాయి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయనపై పల్లా శ్రీనివాసరావు 90000 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలోనే ఇదే అత్యధిక మెజారిటీ. ఎన్నికల ఫలితాల తర్వాత చోడవరం నియోజకవర్గ బాధ్యతలు గుడివాడ అమర్నాథ్ కేటాయించారు. అక్కడ ఇన్చార్జిగా ఉన్న ధర్మ శ్రీ కి అనకాపల్లి పార్లమెంట్ బాధ్యతలు కట్టబెట్టారు.
-
రాజకీయంగా పట్టు కోసం..
ఇప్పుడు భీమిలి ఖాళీ కావడంతో గుడివాడ అమర్నాథ్ అక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. భీమిలి నియోజకవర్గానికి ప్రత్యేక రాజకీయ, భూగోళ ప్రాధాన్యతలు ఉన్నాయి. విశాఖ మహానగరానికి చెంతనే ఉండడం.. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్ రాజకీయ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం స్థానిక నాయకత్వానికి ప్రోత్సాహం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికపరంగా మంచి ప్రభావం చూపగలిగిన నేతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి చివరికి ఏం జరుగుతుందో..
