Homeతెలంగాణఅసెంబ్లీ పొడిగింపు వెనుక వ్యూహం...రేవంత్ భారీ స్కెచ్!

అసెంబ్లీ పొడిగింపు వెనుక వ్యూహం…రేవంత్ భారీ స్కెచ్!

  • ధరణి పాపాల చిట్టాను బయట పెట్టేందుకే..

  • డిఫెన్స్ లోకి గులాబీ పార్టీ 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కొనసాగింపు నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ.. శాసనసభను మాత్రం పొడిగించి.. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చను కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వెనుక పక్కా రాజకీయ, వ్యూహాత్మక లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక సెషన్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు.. ఉభయసభలు ఒకేసారి నిరవధికంగా వాయిదా పడడం ఆనవాయితీ. కానీ అసెంబ్లీని ప్రత్యేకంగా కొనసాగించడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో వ్యూహం పన్నినట్లు అర్థమవుతోంది.

  •  చీకటి ఒప్పందాలను బయట పెట్టేందుకు..

ప్రధానంగా భూవివాదాలు, ధరణి చుట్టూ గత ప్రభుత్వ పాలనలో జరిగిన చీకటి ఒప్పందాలను.. అసెంబ్లీ రికార్డుల్లో అధికారికంగా నమోదు చేయించేందుకు సమావేశాలను పొడిగించినట్లు అర్థం అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదో అస్త్రంగా మారింది. ఇప్పటికే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. మరోవైపు స్పీకర్ వివాదం, అరెస్టులతో వచ్చిన రాజకీయరగడను పక్కకు నెట్టి.. ప్రజలతో నేరుగా ముడిపడి ఉన్న భూ సమస్యల వైపు ప్రజాదృష్టిని మళ్లించేందుకు.. ఏదో అద్భుతమైన అవకాశం. తెలంగాణ సమాజంలో ధరణి పోర్టల్, సెక్షన్ 22a కింద లక్షలాది ఎకరాల పట్టా భూములు నిషేధిత జాబితాలో చిక్కుకున్నాయి. ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఈ సున్నితమైన అంశంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వివరాలను బహిర్గతం చేస్తే.. బీఆర్ఎస్ ఫై ఉన్న పాత వ్యతిరేకత మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందన్నది ప్రభుత్వ వ్యూహం.

  •  రెవెన్యూ మంత్రి ప్రకటన..

ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని భూ బదలాయింపులు ఎలా జరిపింది? గులాబీ పార్టీ అగ్ర నేతల కుటుంబ సభ్యులకు బదలాయింపు ఎలా జరిగింది? అనే అంశాలను ప్రస్తావించారు. అప్పటి బినామీ బాగోతాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఆ పాత రికార్డులను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ధరణి వ్యవహారాలను నడిపిన ఒకరిద్దరు ఉన్నతాధికారులు, కీలక నేతల కనుసన్నల్లోనే వేల కోట్ల విలువైన భూముల నిషేధాలను ఎత్తివేసారని ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన సర్వే నంబర్లు, రికార్డుల సవరణ తేదీలు, అక్రమ రిజిస్ట్రేషన్ లో ఫైళ్లను స్వయంగా సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. ధరణి బండారాన్ని బట్టబయలు చేయనున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

  • భూభారతి వ్యవస్థ పై స్పష్టం..

ధరణి పోర్టల్ ద్వారా నాటి గులాబీ పార్టీ అగ్రనేతలు, వారి కుటుంబ సభ్యులు కొల్లగొట్టిన భూముల వివరాలను బయటపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న భూభారతి వ్యవస్థ ద్వారా తాము ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నామో ప్రజలకు వివరించడం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. నిషేధిత జాబితాలో అన్యాయంగా చిక్కుకుపోయిన నిజమైన రైతుల భూములను విముక్తి చేసేందుకు విధివిధానాలను, కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలను వివరిస్తూ.. తాము పరిష్కార కర్తలం అనే ఇమేజ్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు సీఎం రేవంత్. కేవలం భారత రాష్ట్ర సమితిని డిఫెన్స్ లో పెట్టేందుకే శాసనసభ సమావేశాల పొడిగింపు అనేది స్పష్టమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు