-
సీఎంగా రేవంత్ దూకుడు
-
టిపిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ వైఫల్యం
-
పార్టీని చక్కదిద్దడంలో విఫలం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంగా పరవాలేదు.. పార్టీగా మాత్రం ఫెయిల్ అవుతోంది. ప్రభుత్వ అధినేతగా రేవంత్ మంచి మార్కులు పొందుతున్నారు. కానీ పార్టీ పరంగా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు.
ప్రస్తుతం పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ పనితీరుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పార్టీ క్యాడర్ కు, ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే బలమైన సమన్వయకర్తగా ఆయన వ్యవహరించాల్సి ఉంది. కానీ ఆ పని చేయకపోగా పార్టీలో అంతర్గత అసంతృప్తులను నియంత్రించడంలో కూడా ఘోరంగా విఫలమవుతున్నారనే విమర్శ ఉంది.
-
అప్పటి కాంబినేషన్..
ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి- ధర్మపురి శ్రీనివాస్ కాంబినేషన్ రిపీట్ అయిందని అంతా భావించారు. సీఎం రేవంత్ రెడ్డి- పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ పాత జంట మాదిరిగా ప్రభుత్వాన్ని,, పార్టీని నడిపిస్తారని భావించారు. కానీ సీఎంగా రేవంత్ సక్సెస్ అవుతున్నారు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం తన పనితీరును మెరుగుపరుచుకోలేకపోతున్నారు. పార్టీలో అంతర్గత అసంతృప్తులను సామరస్యంగా సర్దుబాటు చేయలేకపోతున్నారు.
ఇటీవల మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో, ఇతర నేతల అసంతృప్తుల సందర్భంలో పిసిసి చీఫ్ గా క్రమశిక్షణను కాపాడలేకపోయారు. పరోక్షంగా వారిపై అతి సానుభూతి ప్రదర్శించడం, సీఎం రేవంత్ వైపే తప్పు ఉందనే భావన కల్పించడం వంటివి చర్చనీయాంశం అవుతున్నాయి.
-
మాస్ ఇమేజ్ లేదు..
మహేష్ కుమార్ గౌడ్ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు. ఆయనకు మాస్ ఇమేజ్ చాలా తక్కువ. ప్రజాబలం కంటే తెరవెనుక సంస్థాగత సర్దుబాటులతో వచ్చిన గుర్తింపు ఎక్కువ. నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతగా చెప్పుకునే ఆయన.. అదే జిల్లాలోని కాంగ్రెస్ క్షేత్రస్థాయి కార్యకర్తలకు, స్థానిక నాయకులకు ఎంతవరకు సుపరిచితం అనేది పెద్ద ప్రశ్న.
ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో బలమైన ప్రజాబలంతో గెలిచిన దాఖలాలు లేవు. ప్రజాబలంతో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి తానే స్వయంగా పోటీ చేస్తానని ఆయన చెప్పుకున్నప్పటికీ.. పీసీసీ చీఫ్ హోదా, ఎమ్మెల్సీ పదవి లేకపోతే ఆయనను పట్టించుకునే వారు ఉండరు అనేది నిజామాబాద్ సర్కిల్ లో ఉన్న మాట. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష పదవి చేపట్టిన అవకాశం ఆయనకు వచ్చింది. కానీ దానిని సద్వినియోగం చేసుకునే స్థితిలో ఆయన లేరు.
