Homeక్రైమ్ర్యాపిడో పార్శిల్ పేరుతో బంగారు ఆభరణాల చోరీ.. రూ.62 వేల విలువైన నగలతో రైడర్ పరార్!

ర్యాపిడో పార్శిల్ పేరుతో బంగారు ఆభరణాల చోరీ.. రూ.62 వేల విలువైన నగలతో రైడర్ పరార్!

హైదరాబాద్‌లో పార్శిల్ డెలివరీ పేరుతో మోసం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ర్యాపిడో యాప్ ద్వారా బుక్ చేసిన పార్శిల్‌ను తీసుకెళ్లిన ఓ రైడర్, అందులో ఉన్న బంగారు ఆభరణాలతో ఉడాయించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన బంధువుల ఇంటికి బంగారు ఆభరణాలను పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నాగోలులోని బంధువుల ఇంటికి ఆభరణాలను చేర్చేందుకు ర్యాపిడో యాప్‌లో పార్శిల్ సర్వీస్‌ను బుక్ చేశారు. సుమారు రూ.62,383 విలువైన బంగారు నగలను రైడర్‌కు అప్పగించారు.

అయితే పార్శిల్ తీసుకున్న రైడర్ మార్గమధ్యంలో అదనంగా పెట్రోల్ ఖర్చుల పేరుతో మరో రూ.100 చెల్లించాలని కోరాడు. దీంతో బాధితుడు ఫోన్‌పే ద్వారా ఆ మొత్తాన్ని పంపించారు. డబ్బులు అందుకున్న తర్వాత సదరు రైడర్ తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి, పార్శిల్‌తో సహా కనిపించకుండా పోయినట్లు బాధితుడు ఆరోపించారు.

ఎంతసేపటికీ పార్శిల్ గమ్యస్థానానికి చేరకపోవడంతో బాధితుడు రైడర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ ఫోన్ నంబర్ బ్లాక్ కావడంతో అతడిని సంప్రదించలేకపోయారు. ఈ విషయంపై ర్యాపిడో కస్టమర్ కేర్‌ను కూడా సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్శిల్ తీసుకెళ్లిన రైడర్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్ డెలివరీ సేవలను ఉపయోగించుకునే సమయంలో విలువైన వస్తువులను పంపించడంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

also read: దీపావళి ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలు.. నకిలీ షాపింగ్ యాప్స్‌తో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న కేటుగాళ్లు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు