Homeఆంధ్ర ప్రదేశ్పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి.. నిందితుడు అరెస్ట్

పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి.. నిందితుడు అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థినులపై ఓ యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. పాఠశాల తరగతి గదిలోనే జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే ధర్మవరం మండలం నాగలూరికి చెందిన హేమంత్ అనే యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో పాఠశాలలోకి ప్రవేశించాడు. అనంతరం నేరుగా పదో తరగతి గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న ఓ విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో సదరు విద్యార్థినికి తీవ్ర గాయాలై చేయి తెగిపోయినట్లు తెలిసింది. అదే సమయంలో మరో విద్యార్థిని కూడా దాడిలో తీవ్రంగా గాయపడింది.

అనుకోని ఈ పరిణామంతో తరగతి గదిలో ఉన్న విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఇద్దరు విద్యార్థినులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు దాడికి పాల్పడిన హేమంత్ ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ధర్మవరం రైల్వే స్టేషన్‌లో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడి తల్లిదండ్రులు మృతి చెందడంతో అతడు అయ్యవారిపల్లెలో తన అక్క వద్ద ఉంటున్నట్లు తెలిసింది. విద్యార్థినులపై దాడికి గల కారణాలు ఏమిటి? ఈ ఘటనకు ముందు ఏమైనా వివాదాలు ఉన్నాయా? నిందితుడు పాఠశాలలోకి ఎలక్ట్రిక్ రంపంతో ఎలా ప్రవేశించాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

విద్యార్థులు చదువుకునే పాఠశాలలోనే ఇలాంటి ఘటన జరగడం తల్లిదండ్రులు, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణ చర్యలపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
also red : కొత్త టీటీడీ అధ్యక్షుడు ఎవరు…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు