Homeక్రైమ్'ఒమేగా'పై ఐటి గురి...!

‘ఒమేగా’పై ఐటి గురి…!

  • రోజంతా ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు

  • భారీగా పన్ను ఎగవేతే కారణం

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం. ప్రముఖ క్యాన్సర్ కేర్, మల్టీస్పెషలిటీ ఆసుపత్రుల నెట్వర్క్ గా గుర్తింపు పొందిన ఒమేగా హాస్పిటల్ లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ భారీ మెరుపు దాడులకు దిగింది. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన దాదాపు 8 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, ఉత్తరాఖండ్ సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేపట్టాయి. హైదరాబాదులోని బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రధాన ఆసుపత్రుల శాఖలతో పాటు కీలక వైద్యులు, డైరెక్టర్లు, సీఈఓ ల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు ఉదయం నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రుల బయట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేశారు.

16 సంవత్సరాల కిందట…

తెలుగు రాష్ట్రాల్లో ఒమేగా హాస్పిటల్స్ కు మంచి చరిత్ర ఉంది. ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన వంశీ 2010లో హైదరాబాద్ కేంద్రంగా ఈ ఒమేగా హాస్పిటల్స్ ను ప్రారంభించారు. అనతి కాలంలోనే తెలంగాణతో పాటు ఏపీలో ఈ హాస్పిటల్ విస్తరించాయి. ఇతర రాష్ట్రాల్లోనూ పలు శాఖలను విస్తరిస్తూ ప్రముఖ హెల్త్ కేర్ గ్రూప్ గా ఇది మారింది. వైద్య రంగంలో పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ యాజమాన్యానికి.. తెలుగు రాష్ట్రాల రాజకీయ, వ్యాపార ప్రముఖులు, బ్యూరోక్రాట్లతో దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఈ సంస్థ వ్యవస్థాపకుల కుటుంబ సభ్యులు డ్రగ్స్ సంబంధిత కేసుల వివాదాల్లో చిక్కుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

కారణం అదే…

తాజాగా ఆదాయపు పన్ను శాఖ పంజా వెనుక.. భారీ ఎత్తున పన్ను ఎగవేతలకు పాల్పడ్డారన్న నిర్దిష్టమైన నిఘా సమాచారం కారణమని తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స, క్లిష్టమైన సర్జరీలు, ల్యాబ్ పరీక్షల కోసం రోగులనుంచి పెద్ద మొత్తంలో నగదు రూపంలో వసూలు చేసి. వాటిని అధికారిక ఖాతాల్లో చూపించకుండా పక్కదారి పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఐటీ రిటర్న్స్ లో చూపించిన లాభాలకు, ఆసుపత్రి నిర్వహణ ద్వారా సమకూరిన వాస్తవ రాబడి కి మధ్య భారీ తేడాలు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అనుబంధ ఫార్మసీ, వైద్య పరికరాల కొనుగోళ్ల ముసుగులో బోగస్ బిల్లులు సృష్టించి ఖర్చులను పెంచి చూపించినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆదాయపు పన్ను అధికారులు గురిపెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజంతా నిరంతరాయంగా సాగుతున్న ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, డిజిటల్ డేటాను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. బోనీ కపూర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వెనుక అసలు కథ.. డబ్బులు కట్టకపోగా ఆయనే తీసుకున్నారట!
  2.  హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. జలమయమైన రహదారులు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్!
  3. సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.1.10 లక్షల బోనస్!
  4.  తొమ్మిదో నెలలోనూ తగ్గని ఫిట్‌నెస్ జోరు.. వర్కౌట్ వీడియోతో ఆకట్టుకుంటున్న సమంత!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు