Homeతెలంగాణహైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. జలమయమైన రహదారులు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్!

హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. జలమయమైన రహదారులు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్!

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. గంటకు పైగా ఏకధాటిగా వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరోవైపు ఐటీ కారిడార్‌లో వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, కేపీహెచ్‌బీ, మైండ్‌స్పేస్, ఐకియా మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ముఖ్యంగా మాదాపూర్‌లోని సిటీ వైన్స్ సమీపంలో ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుత్బుల్లాపూర్ నుంచి సూరారం వరకు, షాపూర్ నుంచి గాజులరామారం మార్గాల్లోనూ వాహనాలు నెమ్మదిగా కదిలాయి.

సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగింది. కొందరు ప్రయాణికులు వర్షం నుంచి రక్షణ కోసం మెట్రో పిల్లర్ల కింద ఆశ్రయం పొందగా, మరికొందరు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.

ఉప్పల్, ఎల్బీనగర్, మణికొండ, రాయదుర్గం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోనూ వర్షం ప్రభావం స్పష్టంగా కనిపించింది. పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. అయితే, భారీ వర్షంతో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలు మాత్రం హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందిగా మారాయి.

also read: సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.1.10 లక్షల బోనస్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు