క్రైమ్ మిర్రర్ : పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్చల్ చేసింది. విధుల్లో ఉన్న సమయంలోనే మద్యం సేవించి కారును నడపడం, వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో పాటు స్థానికులతో వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు మహిళా కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 26న అశ్విని ఫుల్‌చంద్ కేకన్ అనే మహిళా కానిస్టేబుల్ పోలీస్ యూనిఫామ్‌లో ఉండగానే మద్యం సేవించి కారును నడిపినట్లు సమాచారం. ఈ క్రమంలో మద్యం ప్రభావంతో వాహనంపై ఆమె నియంత్రణ కోల్పోయింది. దీంతో అక్కడున్న కొందరు వ్యక్తులు ఆమెను నిలదీసి ప్రశ్నించారు.
అయితే తన తప్పును అంగీకరించకుండా వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడున్న వారితో దురుసుగా మాట్లాడుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించింది. దీంతో అక్కడి పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలను గమనించిన కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్ మద్యం మత్తులో కారు నడపడం, ప్రజలతో వాగ్వాదానికి దిగడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వీడియో క్రమంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు. మహిళా కానిస్టేబుల్ అశ్విని కేకన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె మద్యం సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు సమాచారం.
కేసు నమోదు.. సస్పెండ్ చేసిన అధికారులు
వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మంజరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ క్రమశిక్షణను ఉల్లంఘించడమే కాకుండా, శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిందనే కారణంతో అశ్విని కేకన్‌ను సస్పెండ్ చేశారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన పోలీసు సిబ్బందే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పూణేలో హాట్ టాపిక్‌గా మారింది.
also read : ‘సత్యం’ వధ.. ధర్మం చెద…!
