-
హై కమాండ్ తీరుపై తీవ్ర ఆగ్రహం
-
ధర్మాన సోదరుల వైఖరిని నిరసిస్తూ పార్టీ నుంచి బయటకు..
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మొన్ననే విజయనగరం జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు అదే బాటలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
గత కొంతకాలంగా నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారు తమ్మినేని. ఆమదాలవలస వైసిపి బాధ్యతలు నుంచి తనను తప్పించి చింతాడ రవికుమార్ అనే ద్వితీయ శ్రేణి నాయకుడికి అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
తన కుమారుడికి బాధ్యతలు ఇప్పించాలని ఆయన బలంగా కోరుతున్నారు. అయితే హై కమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో తమ్మినేని పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధపడినట్లు ప్రచారం నడుస్తోంది.
-
వైసిపి పై విమర్శలు..
తాజాగా తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని అన్నారు.
అనుమానం ఉంటే అంతర్గత సర్వే నివేదికలను సరిచూసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇటీవల కొంతమంది వైసీపీ నేతలు తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
భూ వివాదానికి సంబంధించి తమ్మినేని కుటుంబం అరెస్టు కాకపోవడానికి టిడిపి తో కుమ్మక్కు రాజకీయాలే కారణమని ఆరోపించారు. అయితే దీనిని జిల్లా నాయకత్వం కనీసం ఖండించలేదు. ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉండడం కంటే బయటకు వెళ్లిపోవడమే మేలన్న నిర్ణయానికి తమ్మినేని ఫ్యామిలీ వచ్చినట్లు జిల్లా వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
-
ధర్మాన ఫ్యామిలీ కుట్ర..
తమపై తెరవెనుక ధర్మాన ఫ్యామిలీ కుట్ర చేస్తోంది అనేది తమ్మినేని కుటుంబంలో ఉన్న అనుమానం. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ధర్మాన సోదరులు పార్టీలో తమ్మినేనిని లేకుండా చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు అనేది ఒక వాదన. ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ అరెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే.
జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఓ మహిళ ఎస్సై పట్ల అనుచిత ప్రవర్తన పై కేసు నమోదు కావడంతో ఆయన అరెస్టు జరిగింది. అదే సమయంలో తమ్మినేని ఫ్యామిలీ పై ఓ భూ కబ్జా కేసు నమోదు అయింది. చింతాడ రవికుమార్ అరెస్టు జరిగి.. తమ్మినేని ఫ్యామిలీ అరెస్టు జరగకుండా చేయడం వెనుక కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయి అంటూ మొన్న మధ్యన వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. అయితే దీని వెనుక ధర్మాన సోదరుల హస్తం ఉందనేది తమ్మినేని కుటుంబం అనుమానం.
-
తమ్మినేనిని తప్పించి..
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తమ్మినేని సీతారాంకు సమీప బంధువు. తమ్మినేని ఫ్యామిలీ పై కేసులు నమోదు కాకుండా కూన రవికుమార్ అడ్డుపడుతున్నారన్నది వైసీపీ ఆరోపణ. గతంలో తెలుగుదేశం లోనే కొనసాగే వారు తమ్మినేని సీతారాం. 1983 నుంచి 1999 వరకు ఆమదాలవలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి అయ్యేవారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు తమ్మినేని. కానీ పార్టీలోనే ఉండిపోయారు ఆయన మేనల్లుడు కూన రవికుమార్. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టిడిపి అభ్యర్థిగా గెలిచారు రవికుమార్. 2019లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు తమ్మినేని సీతారాం. 2024లో తిరిగి రవికుమార్ ఎమ్మెల్యే అయ్యారు.
అయితే కుటుంబంలో సర్దుబాటు ఉందన్న అనుమానాల నేపథ్యంలో తమ్మినేని సీతారాంను వైసీపీ బాధ్యతలు నుంచి తప్పించి చింతాడ రవికుమార్ కు అప్పగించారు. అప్పటినుంచి తమ్మినేని ఆగ్రహంగా ఉన్నారు. తాజా పరిణామాలతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
