వైఎస్సార్ జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సాగిన పోలీసు విచారణ ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వ్యవహారానికి సంబంధించి పోలీసులు సుమారు రెండు గంటల పాటు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం స్టేషన్ బయట అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తనపై జరిగిన విచారణ తీరును తప్పుబట్టారు. ఒకే చిన్న అంశాన్ని సాకుగా చూపి రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా ఏకంగా 36 కేసులు నమోదు చేయడం ఏంటని అంబటి పోలీసులను ప్రశ్నించారు. ఇది పక్కా రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్రస్థాయిలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని అంబటి రాంబాబు విమర్శించారు. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము మహానేత వైఎస్సార్ వారసులమని ఇలాంటి బెదిరింపులకు కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం ప్రజాస్వామ్యానికే విఘాతమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయని కానీ వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయని గుర్తు చేశారు.
రాబోయే కాలంలో రాష్ట్రంలో మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుందని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల జాబితా తమ వద్ద సిద్ధంగా ఉందని హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు తప్పుడు కేసులు పెట్టిన వారందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరికలు జారీ చేశారు. వేధింపులకు గురిచేసిన ప్రతి అధికారి భవిష్యత్తులో ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నారు. అధికార గర్వంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మానుకోవాలని అంబటి అధికారులకు సూచించారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం సహజమని దానికి కేసులు పెట్టడం ఏంటని ఆయన నిలదీశారు. సోషల్ మీడియా పోస్టులను అడ్డం పెట్టుకుని భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తే అది సాధ్యం కాదని చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలీసుల విచారణకు తాము ఎప్పుడూ సహకరిస్తామని అయితే అది పారదర్శకంగా ఉండాలని కోరారు.
ALSO READ: జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం.. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్లు అందజేస్తాం: మంత్రి పొంగులేటి